
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ (29) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ తన కెరీర్‌లో స్వదేశంలో జరిగిన టెస్ట్‌ల్లో 7216 పరుగులు చేయగా.. తాజాగా ఇన్నింగ్స్‌తో రూట్ (7220) సచిన్ రికార్డును అధిగమించాడు.
ఈ విభాగంలో ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ (7578) అగ్రస్థానంలో ఉండగా.. రూట్ సచిన్‌ను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.
స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు..
7578 - రికీ పాంటింగ్ - ఆస్ట్రేలియా
7220* - జో రూట్ - ఇంగ్లండ్*
7216 - సచిన్ టెండూల్కర్ - ఇండియా
7167 - మహేల జయవర్ధనే - శ్రీలంక
7035 - జాక్వెస్ కల్లిస్ - దక్షిణాఫ్రికా
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది.
హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది.