భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్ అండర్-19 జట్టుతో పాటు ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.
సంచలనాలకు కేంద్రం
నిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్ స్టార్స్‌తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్‌కు ట్రోఫీ అందించాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో
ఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-4లో నిలిచాడు.
ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్, బ్రియాన్ లారా, సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
యాక్టివిస్ట్ సంచలన వ్యాఖ్యలు
ఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్‌లో యాక్టివిస్ట్‌గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్‌ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.
చైల్డ్ లేబర్.. చదువుకోనివ్వండి
ఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్ క్రికెట్ ఆడనివ్వద్దు. క్రికెట్ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
This activist appeared on a Kannada TV channel and said he plans to file a police case or legal complaint against Rajasthan Royals.
He said - Don't let this 15-year-old boy "Vaibhav Suryavanshi " play IPL cricket — it's child labour, he should study! pic.twitter.com/zEwVJQseGR— ExtraOrdinary (@Extreo_) May 2, 2026
క్రీడాకారులకు వర్తిస్తుందా?
కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్‌గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు.. చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.
ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్
నిజానికి వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్‌ను ఐపీఎల్‌లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి
కాగా వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు.
అయితే, చదువులోనూ వైభవ్ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్ కారణంగా అతడు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్‌ను కొన్న రాజస్తాన్ రాయల్స్.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దించింది.


