టీమిండియా కెప్టెన్‌గా దినేశ్‌ కార్తిక్‌.. ప్రకటన విడుదల | Dinesh Karthik Named India Captain for Hong Kong Cricket Sixes 2025 | Sakshi
Sakshi News home page

భారత జట్టు కెప్టెన్‌గా దినేశ్‌ కార్తిక్‌.. ప్రకటన విడుదల

Sep 23 2025 3:38 PM | Updated on Sep 23 2025 3:56 PM

Dinesh Karthik Named Team India Captain in Hong Kong Sixes 2025

హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్‌లో భారత జట్టు కెప్టెన్‌గా దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik)ఎంపికయ్యాడు. నవంబరు 7 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో టీమిండియాకు ఈ మాజీ క్రికెటర్‌ సారథ్యం వహించనున్నాడు. కాగా 1992 నుంచి నిర్వహిస్తున్న హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సెస్‌లో భారత్‌ ఇప్పటికి ఒకే ఒక్కసారి చాంపియన్‌గా నిలిచింది.

ఇరవై ఏళ్ల క్రితం భారత జట్టు 2005 ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక గతేడాది రాబిన్‌ ఊతప్ప కెప్టెన్సీ భారత్‌ కనీసం ఫైనల్‌ కూడా చేరలేదు. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో కెప్టెన్‌ను మార్పు చేయడం గమనార్హం.

ప్రకటన విడుదల
ఇందుకు సంబంధించి హాంకాంగ్‌ క్రికెట్‌ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అపార అనుభవం, నాయకత్వ లక్షణాలు, విధ్వంసకర బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న దినేశ్‌ కార్తిక్‌ ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతాడనడంలో సందేహం లేదు.

భయం లేని, వినోదాత్మకమైన, వరల్డ్‌క్లాస్‌ ఆట చూపించేందుకు సిక్సెస్‌ దినేశ్‌ కార్తిక్‌తో సిద్ధంగా ఉంది’’ అని హాంకాంగ్‌ క్రికెట్‌ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల దినేశ్‌ కార్తిక్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.

2004- 2022 వరకు
టీమిండియా తరఫున 2004- 2022 వరకు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడాడు. మొత్తంగా 26 టెస్టుల్లో 1025, 94 వన్డేల్లో 1752, 69 టీ20 మ్యాచ్‌లలో కలిపి 686 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 2008- 2024 వరకు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించిన డీకే.. 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు చేశాడు.

ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన దినేశ్‌ కార్తిక్‌.. ఈ ఏడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌గా వ్యవహరించాడు. పదిహేడేళ్ల కలకు తెరదించుతూ ఆర్సీబీ ఈ ఏడాది ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. దీంతో డీకే సంబరాలు కూడా అంబరాన్నంటాయి.

అశూ కూడా 
అయితే, ఇప్పుడు హాంకాంగ్‌ సిక్సెస్‌ ద్వారా ఆటగాడిగా మరోసారి బ్యాట్‌తో అలరించేందుకు డీకే సిద్ధమయ్యాడు. కాగా ఈ టోర్నీలో ఒక్కో జట్టు ఆరు ఓవర్లు ఆడుతుంది. ఇక గతేడాది రాబిన్‌ ఊతప్ప కెప్టెన్సీలో మనోజ్‌ తివారి, కేదార్‌ జాదవ్‌, శ్రీవత్స్‌ గోస్వామి వంటి మాజీ ఆటగాళ్లు ఇందులో భాగమయ్యారు. 

ఈసారి దినేశ్‌ కార్తిక్‌తో పాటు టీమిండియా తాజా మాజీ ఆటగాడు, స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాడు. అయితే, భారత జట్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

చదవండి: IND vs AUS: శ్రేయస్‌ అయ్యర్‌ అనూహ్య నిర్ణయం.. గుడ్‌బై చెప్పేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement