‘ఆ క్షణం లైబ్రరీలా అనిపించింది’  | Sakshi
Sakshi News home page

‘ఆ క్షణం లైబ్రరీలా అనిపించింది’ 

Published Wed, Nov 29 2023 3:45 AM

Cummins comments on Kohlis wicket - Sakshi

సిడ్నీ: వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి వారం రోజులు దాటినా ఆ్రస్టేలియా జట్టు తమ విజయాన్ని ఇంకా వేడుకలా జరుపుకుంటూనే ఉంది. మంగళవారం సిడ్నీ మైదానంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్, పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కలిసి వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా కమిన్స్‌ తన ఫైనల్‌ మ్యాచ్‌ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా కోహ్లి వికెట్‌ తీయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అతను అన్నాడు.

కమిన్స్‌ బంతిని కోహ్లి వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్‌ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఆ క్షణం మైదానంలో ఆవరించిన నిశ్శబ్దం మరచిపోలేనని కమిన్స్‌ అన్నాడు. ‘కోహ్లి వికెట్‌ పడిన తర్వాత మా జట్టు సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటుంటే స్మిత్‌ ఒక మాట అన్నాడు. మైదానంలో ఏదైనా శబ్దం వినిపిస్తోందా అని అడిగాడు. మేం ఒక క్షణం ఆగి గమనించాం. స్టేడియం మొత్తం ఒక లైబ్రరీలా అనిపించింది.

లక్ష మంది ఉన్న మైదానంలో అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఈ ఘట్టాన్ని చిరకాలం గుర్తుంచుకుంటా’ అని కమిన్స్‌ వ్యాఖ్యానించాడు. ఒకే సమయంలో భిన్న ఫార్మాట్‌లలో తాము ప్రపంచ చాంపియన్‌లుగా ఉండటం చాలా గర్వంగా ఉందని అన్నాడు. 

ఆరుగురు ఆసీస్‌ ఆటగాళ్లు ముందుగానే... 
భారత్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో పాల్గొంటున్న ఆ్రస్టేలియా జట్టులోని ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు సిరీస్‌ ముగియడానికి ముందే స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నవారిలో ఏడుగురు టి20 సిరీస్‌ కోసం ఇక్కడే ఆగిపోయారు. వీరిలో హెడ్‌ ఒక్కడే సిరీస్‌ ముగిసే వరకు ఉండనున్నారు.

స్మిత్, జంపా ఇప్పటికే బయల్దేరిపోగా...మరో నలుగురు మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, ఇన్‌గ్లిస్, అబాట్‌ మూడో మ్యాచ్‌ ముగియగానే వెళ్లిపోతారు. చివరి రెండు మ్యాచ్‌లకు వీరు అందుబాటులో ఉండటం లేదు. వీరి స్థానాల్లో జోష్‌ ఫిలిప్, బెన్‌ మెక్‌డెర్మాట్, బెన్‌ డ్వార్‌షియస్, క్రిస్‌ గ్రీన్‌లను ఆ్రస్టేలియా సెలక్టర్లు ఎంపిక చేశారు.  

Advertisement
Advertisement