రియాద్: మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఆసియా గడ్డపై తొలి ప్రొఫెషనల్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ క్లబ్ జట్టుకు 41 ఏళ్ల రొనాల్డో సౌదీ ప్రొ లీగ్ టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా రొనాల్డో ప్రొఫెషనల్ కెరీర్‌లో ఇది 36వ టైటిల్ కాగా.. సౌదీ ప్రొ లీగ్‌లో అల్ నాసర్ జట్టు 11వసారి చాంపియన్‌గా నిలిచింది. డామక్ క్లబ్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అల్ నాసర్ జట్టు 4–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
అల్ నాసర్ జట్టు తరఫున రొనాల్డో (62వ, 80వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సాడియో మానె (33వ నిమిషంలో), కింగ్‌స్లే కామన్ (51వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. డామక్ జట్టుకు మొర్లాయె సిలా (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 18 జట్ల మధ్య ఇంటాబయటా పద్ధతిలో ఈ లీగ్‌ను నిర్వహించారు. నిరీ్ణత 34 మ్యాచ్‌ల తర్వాత అల్ నాసర్ జట్టు 86 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. అల్ నాసర్ జట్టు 28 మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 91 గోల్స్ సాధించి, 28 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు సమరి్పంచుకుంది. అల్ హిలాల్ జట్టు 84 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
రొనాల్డో గెలిచిన ట్రోఫీలు
స్పోరి్టంగ్ సీపీ (పోర్చుగల్): పోర్చుగల్ సూపర్ కప్ (1) మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ (ఇంగ్లండ్): ప్రీమియర్ లీగ్ (3), యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్ (1), ఎఫ్‌ఏ కప్ (1), కరాబావో కప్ (2), కమ్యూనిటీ షీల్డ్ (1), ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ (1).
రియల్ మాడ్రిడ్ క్లబ్ (స్పెయిన్): లా లిగా (2), యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్ (4), కోపా డెల్ రే కప్ (2), స్పానిష్ సూపర్ కప్ (2), యూఈఎఫ్‌ఏ సూపర్ కప్ (3), ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ (3).
యువెంటాస్ క్లబ్ (ఇటలీ): సెరియా ‘ఎ’ (2), కోపా ఇటాలియా (1), ఇటాలియన్ సూపర్ కప్ (2).
అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా): సౌదీ ప్రొ లీగ్ (1), అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్ (1)
పోర్చుగల్ జాతీయ జట్టు: యూఈఎఫ్‌ఏ యూరో కప్ (1), యూఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్ (2).


