మళ్లీ ‘రింగ్‌’లోకి దిగాలనుంది | A comment by legendary female boxer Mary Kom | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘రింగ్‌’లోకి దిగాలనుంది

Oct 4 2024 3:53 AM | Updated on Oct 4 2024 3:53 AM

A comment by legendary female boxer Mary Kom

మహిళా దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ వ్యాఖ్య 

ముంబై: బాక్సింగ్‌ క్రీడకు తాను ఇంకా రిటైర్మెంటే ప్రకటించలేదని... మళ్లీ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ సర్క్యూట్‌లోకి దిగాలనే ఆలోచన ఉందని భారత మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ తెలిపింది. ‘పోటీల్లో పాల్గొనాలనుకుంటున్నాను. పునరాగమనంపై నా అవకాశాల కోసం చూస్తున్నా. ఇంకో నాలుగేళ్లు ఆడే సత్తా నాలో వుంది. నా ప్రపంచం బాక్సింగే. అందుకే అందులో ఎంత ఆడినా, పతకాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లెన్ని గెలిచినా ఇంకా కెరీర్‌ను కొనసాగించాలనే ఆశతో ఉన్నాను’ అని మాజీ రాజ్యసభ ఎంపీ అయిన మేరీకోమ్‌ తెలిపింది. 

పారిస్‌లో భారత బాక్సర్ల వైఫల్యం... దరిమిలా తన అభిప్రాయాలను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్‌ సమాఖ్యతో వివరించాలనుకుంటున్నట్లు చెప్పింది. ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్, రియో పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌ పారిస్‌లో పతకాలు గెలుపొందలేకపోయారు. ఇక టోర్నీల సమయంలో బరువు నియంత్రణ, నిర్వహణ బాధ్యత పూర్తిగా క్రీడాకారులదేనని మేరీకోమ్‌ స్పష్టం చేసింది. 

ఇటీవల పారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ వంద గ్రాముల అధిక బరువుతో పసిడి వేటలో అనర్హతకు గురైంది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల మేరీ ఆమె పేరును ప్రస్తావించకుండా ‘బరువు’ బాధ్యత గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘ఈ విషయంలో నేనెంతగానో నిరాశకు గురయ్యాను. నేను కూడా ఇలాంటి సమస్యల్ని కొన్నేళ్ల పాటు ఎదుర్కొన్నాను. అతి బరువు నుంచి మనమే జాగ్రత్త వహించాలి. ఇది మన బాధ్యతే! ఇందులో నేను ఎవరినీ నిందించాలనుకోను. 

వినేశ్‌ కేసుపై నేను వ్యాఖ్యానించడం లేదు. నా కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. బరువును నియంత్రించుకోకపోతే బరిలోకి దిగడం కుదరదు. పతకం లక్ష్యమైనపుడు మన బాధ్యత మనకెపుడు గుర్తుండాలిగా’ అని వివరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement