కామెంట్రీ చేస్తున్న ఎల్. శివరామకృష్ణన్ (PC: X)
వర్ణ వివక్ష కారణంగా మానసికంగా తానెంతో కుంగిపోయానన్నాడు భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్. తన శరీరం నలుపు రంగులో ఉన్నందున ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయాడు. తన ప్రతిభను గుర్తించకుండా కేవలం మేని ఛాయను చూసి హేళన చేసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రతిభ ఉన్నా
కాగా తమిళనాడుకు చెందిన శివరామకృష్ణన్ 1980వ దశకంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మొత్తంగా తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన పడగొట్టిన అతడు.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశాడు. ఇక 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్ గావస్కర్ సారథ్యంలో భారత జట్టు బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ గెలవడంలోనూ అతడిది కీలక పాత్ర.
అయితే, ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైపోయిన శివరామకృష్ణన్ 2000 సంవత్సరంలో కామెంటేటర్ అవతారం ఎత్తాడు. ఐసీసీ క్రికెట్ కమిటీలో ప్లేయర్ రిప్రజెంటేటివ్‌గానూ పనిచేసిన అతడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నల్లగా ఉన్నాననే కారణంతోనే 23 ఏళ్లుగా బీసీసీఐ తనను విస్మరించిందని.. టాస్‌లు వేయడానికి అనుమతించలేదని సంచలన ఆరోపణలు చేశాడు.
షూ శుభ్రం చేయమని చెప్పాడు
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన శివరామకృష్ణన్ చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న వర్ణ వివక్ష గురించి గుర్తుచేసుకున్నాడు. ‘‘పద్నాలుగేళ్ల వయసులో చెపాక్‌లో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను నెట్‌బౌలర్‌గా చేరాను.
అప్పటికి స్కూల్ నుంచి యూనిఫామ్‌లోనే ఉన్నాను. వెంటనే వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాను. ఇంతలో భారత జట్టుకు చెందిన ఓ సీనియర్ బ్యాటర్ నన్ను పిలిచి.. తన షూ శుభ్రం చేయమని చెప్పాడు.
అందుకు నేను గట్టిగానే బదులిచ్చాను. అది నా పని కాదని చెప్పేశాను. నిజానికి ఆయన నన్ను గ్రౌండ్ సిబ్బంది అనుకుని పొరబడ్డారట. జాతి, వర్ణ వివక్ష అంటే ఏమిటో అప్పటిదాకా నాకు తెలియదు. ఆ మనిషి అన్న మాటలకు ఆరోజు ఎలా స్పందించాలో నాకు తెలియలేదు.
నల్లోడు అంటూ హేళన
ఇక తమిళనాడు జట్టులోనూ నన్ను కరుపా (నల్లోడు) అని పిలిచేవారు. ముంబై, చండీగఢ్, జలంధర్ వంటి చోట్ల బౌండరీల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. ‘నల్లోడా.. నీకేమైంది?’ అంటూ హేళన చేసేవారు.
నా 17వ పుట్టినరోజున అనుకుంటా. సునిల్ గావస్కర్ నా కోసం కేక్ తెప్పించాడు. ఇంతలో ఓ సీనియర్ ఆటగాడు వచ్చి.. ‘హేయ్ సన్నీ.. నువ్వు సరైన రంగున్న కేక్‌నే ఆర్డర్ చేశావు. నల్లబ్బాయికి నల్లటి (డార్క్ చాకొలెట్ కేక్) కేకే కరెక్ట్’ అని అన్నాడు. దీంతో నేను ఎంతో బాధపడ్డాను.
కన్నీళ్లు కారుస్తూ..
అంతలో సన్నీ వచ్చి నన్ను ఓదార్చి, బుజ్జగించి కేక్ కట్ చేయించాడు. అప్పటికి నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి’’ అని చేదు అనుభవాలను లక్ష్మణ్ శివరామకృష్ణన్ గుర్తుచేసుకున్నాడు.
చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?


