
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ప్రత్యేక కారణంగా వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకున్నందుకు ఆ జట్టు భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని జట్టులోకి ఎలా తీసుకుంటారని భారత అభిమానులు డీసీ యాజమాన్యంపై మండిపడుతున్నారు.
తాజాగా జరిగిన యుద్దంలో బంగ్లాదేశ్ పాక్‌కు అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముస్తాఫిజుర్ ఎంపికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్తాఫిజుర్ ఎంపిక సిగ్గుచేటు చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియా #BocottDelhiCapitals ట్రెండింగ్‌లో ఉంది.
కాగా, భారత్-పాక్ మధ్య యుద్దం నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఆస్ట్రేలియా) ఐపీఎల్‌కు తిరిగి రానని స్పష్టం చేశాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా డీసీ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ను ఎంపిక చేసుకుంది. రూ. 6 కోట్ల భారీ మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకుంది.
As a Delhiite, I can no longer support @DelhiCapitals. The franchise's support for players from a country known for its anti-India stance, including backing Pakistan, is unacceptable to me. #BoycottDelhiCapitals pic.twitter.com/M3qMGcshWk
— Abhinav (@AbhinavStarx) May 14, 2025
ముస్తాఫిజుర్ ఎంపిక ఢిల్లీకి మేలు చేస్తుంది
పై విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత కీలక దశలో ముస్తాఫిజుర్ ఎంపిక ఢిల్లీకి మేలే చేస్తుంది. ఏదైనా కారణం చేత మిచెల్ స్టార్క్ తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే ఢిల్లీని అతనే ఆదుకునే అవకాశం ఉంది. ముస్తాఫిజుర్‌కు పరిమత ఓవర్ల ఫార్మాట్‌లో, ముఖ్యంగా టీ20ల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. పైగా అతను ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్‌కు గతంలో (2022, 2023) డీసీ ఆడిన అనుభవం కూడా ఉంది.
పీడ వదిలిందనుకుంటున్న అభిమానులు
ఢిల్లీ ఓపెనర్ మెక్‌గుర్క్ ఐపీఎల్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో 9 కోట్లు పెట్టి కొనుక్కున్న మెక్‌గుర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో (ఎస్‌ఆర్‌హెచ్) కలుపుకుని 13 పాయింట్లు (0.362) సాధించింది.
ఈ సీజన్‌లో డీసీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌తో (ఢిల్లీ), మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై), మే 24న పంజాబ్‌తో (జైపూర్) తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఖచ్చితంగా గెలిస్తేనే డీసీ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.