ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి.. భువనేశ్వర్ మాత్రం మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ పేసర్ ఇషన్ మలింగ(15 వికెట్లు)ను వెనక్కి నెట్టి భువీ(17 వికెట్లు) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను భువనేశ్వర్ తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత గడ్డపై 200 ఐపీఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడంతో ఈ ఫీట్‌ను భువనేశ్వర్ సాధించాడు. భువీ తర్వాత స్ధానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చాహల్(228) అగ్రస్ధానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్(215) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
భువనేశ్వర్ కుమార్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు పుణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ వంటి మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సన్‌రైజర్స్ తరపున వరుసగా రెండుసార్లు (2016, 2017) పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్‌గా భువీ నిలిచాడు.
చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?


