BGT 2023: మూడో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌.. సిరీస్‌ నుంచి వైదొలిగిన స్టార్‌ బౌలర్‌

BGT 2023: Injured Hazlewood Out Of Indore, Ahmedabad Tests - Sakshi

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పరిస్థితి. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023 ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న ఆసీస్‌.. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌ల్లో ఓటమిపాలై, సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆ జట్టును గాయాల బెడద తారా స్థాయిలో వేధిస్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లకు స్టార్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ దూరం కాగా.. తాజాగా అందిన సమాచారం మేరకు హేజిల్‌వుడ్‌ సిరీస్‌ మొత్తానికే దూరం కానున్నట్లు తెలుస్తోంది.

మడమ గాయంతో బాధపడుతున్న 32 ఏళ్ల హేజిల్‌వుడ్‌.. ఇండోర్‌, అహ్మదాబాద్‌లలో జరిగే మూడు, నాలుగు టెస్ట్‌లకు అందుబాటులో ఉండడని ఆసీస్‌ హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ కన్ఫర్మ్‌ చేశాడు. హేజిల్‌వుడ్‌ తన రిహాబిలిటేషన్‌ను సిడ్నీలో కొనసాగిస్తాడని వెల్లడించాడు. మరోవైపు రెండో టెస్ట్‌ సందర్భంగా గాయపడ్డ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై మాట్లాడేందుకు మెక్‌ డొనాల్డ్‌ ఆసక్తి కనబర్చలేదు.

వార్నర్‌ విషయంలో తొందరపడి ఎలాంటి ప్రకటన చేయకూడదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వార్నర్‌ అందుబాటులో ఉండే విషయం లేని విషయం మూడో టెస్ట్‌ ప్రారంభం ముందు వరకు బహిర్గతం చేయకూడదని టీమ్‌ డిస్కషన్‌లో చర్చించినట్లు సమాచారం. కాగా, న్యూఢిల్లీ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా వార్నర్‌ మోచేతికి తీవ్ర గాయం కాగా.. అతని స్థానంలో కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్‌ రెన్‌షా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. 

ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్‌ గెలిస్తే టీమిండియా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇదివరకే భారత్‌.. వన్డే, టీ20ల్లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top