
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన (జెర్సీ) స్పాన్సర్‌షిప్ విలువను బీసీసీఐ మరింత పెంచింది. ఇటీవలే ‘డ్రీమ్ 11’ను తప్పించడంతో కొత్త స్పాన్సర్‌షిప్ వేటలో ఉన్న బోర్డు ఈసారి మరింత పెద్ద మొత్తాన్ని ఆశిస్తోంది. కొత్త విలువ ప్రకారం భారత్ ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు స్పాన్సరర్ రూ. 3 కోట్ల 50 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఎక్కువ దేశాలు పాల్గొనే ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీలో అయితే ఇది ఒక్కో మ్యాచ్‌కు రూ. 1 కోటీ 50 లక్షలుగా ఉంది. ‘డ్రీమ్ 11’ ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 17 లక్షలు, రూ.1 కోటీ 12 లక్షలు చెల్లిస్తూ వచ్చింది. ఆసియా కప్ ముగిసిన తర్వాతే జెర్సీ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ఖరారు కానుంది.
ఇక బోర్డు ఆశించిన విధంగా జరిగితే ఏడాదికి సుమారు రూ. 400 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరతాయి.ఇదిలా ఉంటే.. స్పాన్సర్‌షిప్ కోసం బిడ్‌లను కోరుతూ మంగళవారం బోర్డు ప్రకటన ఇచ్చింది. దీనికి ఆఖరి తేదీ సెప్టెంబరు 16 కావడంతో జెర్సీ స్పాన్సర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.
ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత...
లండన్: ఆఖరిదాకా ఉత్కంఠ రేపిన రెండో వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. తద్వారా వరుస విజయాలతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఇంగ్లండ్‌పై సిరీస్‌ను కైవసం చేసుకుంది.
1998 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో సఫారీ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
ముందుగా దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూ బ్రిట్జ్‌కీ (77 బంతుల్లో 85; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (62 బంతుల్లో 58; 2 ఫోర్లు, 1 సిక్స్), మార్క్‌రమ్ (64 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (20 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కార్బిన్ బాష్ (32 నాటౌట్; 3 ఫోర్లు) సమష్టిగా రాణించారు.
తన కెరీర్‌లో ఐదో వన్డే ఆడిన బ్రిట్జ్‌కీ వరుసగా నాలుగో అర్ధ సెంచరీ చేయడం విశేషం. న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 10న అరంగేట్రం వన్డేలో సెంచరీ (150) చేసిన బ్రిట్జ్‌కీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 83, 57, 88, 85 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 4, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ దాదాపు గెలుపుతీరం దాకా కష్టపడింది. చివరకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులకు పరిమితమైంది.
తద్వారా విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆర్చర్ (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరిదాకా జట్టును గెలిపించేందుకు విఫల ప్రయత్నం చేశాడు.
అంతకుముందు రూట్ (72 బంతుల్లో 61; 8 ఫోర్లు), బట్లర్ (51 బంతుల్లో 61; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెథెల్ (40 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. బర్గర్ 3, కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశారు. రేపు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే జరుగుతుంది.
చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు