రెండో టీ20 వర్షార్పణం | Bangladesh vs New Zealand 2nd T20I Abandoned Due To Rain | Sakshi
Sakshi News home page

రెండో టీ20 వర్షార్పణం

Apr 29 2026 6:53 PM | Updated on Apr 29 2026 7:38 PM

Bangladesh vs New Zealand 2nd T20I Abandoned Due To Rain

న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరగాల్సిన రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఆధిక్యం 1-0తో కొనసాగుతోంది. ఏప్రిల్‌ 27న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో టీ20 ఢాకా వేదికగా మే 2న జరుగనుంది.

కాగా, 3 మ్యాచ్‌ల వన్డే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌
చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్‌ను 182 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కేటీన్‌ క్లార్క్‌ (51), డేన్‌ క్లీవర్‌ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్‌ క్లార్క్‌సన్‌ (27 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ 2, షోరిఫుల్‌ ఇస్లాం, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. తౌహద్‌ హృదోయ్‌ (51 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్‌కు పర్వేజ్‌ హొసేన్‌ (28), షమీమ్‌ హొసేన్‌ (31 నాటౌట్‌) సహకరించారు. 

మిగతా ఆటగాళ్లలో సైఫ్‌ హసన్‌ 17, తంజిద్‌ హసన్‌ 20, కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఐష్‌ సోధి 2, జోష్‌ క్లార్క్‌సన్‌, నాథన్‌ స్మిత్‌ తలో వికెట్‌ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement