న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. సోమవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్‌పై 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా జట్టు 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది.
కివీస్ బ్యాటర్లలో నిక్ కెల్లీ (102 బంతుల్లో 83 పరుగులు, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెల్లీ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. మిగితా బ్యాటర్ల నుంచి అతడి సహకారం లభించలేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాణా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. అతడితో పాటు షోర్‌ఫుల్ ఇస్లాం రెండు.. రిషాద్, టాస్కిన్ అహ్మద్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.
తాంజిద్ మెరుపులు
అనంతరం 199 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ తాంజిద్ హసన్ (58 బంతుల్లో, 76 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో నజ్ముల్ హొస్సేన్ శాంటో(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో జేడెన్ లెనాక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్మిత్, ఓ రూర్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఏప్రిల్ 23న ఛటోగ్రామ్‌లో జరగనుంది.
చదవండి: IPL 2026: అతడిపై మీకు నమ్మకం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్!


