రాహుల్‌ మరోసారి..! | Back to back failures for KL Rahul in IPL 2026 | Sakshi
Sakshi News home page

రాహుల్‌ మరోసారి..!

Apr 4 2026 6:08 PM | Updated on Apr 4 2026 6:32 PM

Back to back failures for KL Rahul in IPL 2026

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌటైన ఇతను.. ముంబై ఇండియన్స్‌తో ఇవాల్టి (ఏప్రిల్‌ 4) మ్యాచ్‌లో ఖాతా తెరిచిన వెంటనే ఇన్నింగ్స్‌ను ముగించాడు.

రాహుల్‌ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆందోళన మొదలైంది. ఆ జట్టు ఫ్యాన్స్‌ రాహుల్‌ను బహిరంగంగా టార్గెట్‌ చేస్తున్నారు. జట్టులో అందరి కంటే సీనియర్‌వి.. మిగతా ఆటగాళ్లను ఆదర్శంగా ఉండాలంటూ చురకలంటిస్తున్నారు. 

మరోపక్క టీమిండియా సీనియర్లతో కంపేర్‌ చేస్తూ నిందిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ రాణించారు. రాహుల్‌ మాత్రమే ఎందుకు విఫలమవుతున్నాడని ఫీలవుతున్నారు.

ఇదిలా ఉంటే, రాహుల్‌ విఫలమైన ​తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గట్టెక్కిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాహుల్‌ సహా నిస్సంక, నితీశ్‌ రాణా, అక్షర్‌ పటేల్‌ విఫలమైనా, సమీర్‌ రిజ్వి (70 నాటౌట్‌) అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (39 నాటౌట్‌) సహకరించాడు.

ముంబై ఇండియన్స్‌తో నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతుంది. 7 పరుగులకే రాహుల్‌, నితీశ్‌ రాణా (0) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. నిస్సంక (39), సమీర్‌ రిజ్వి (7) ఢిల్లీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్‌ కుమార్‌ 2, ఎంగిడి, అక్షర్‌ పటేల్‌, విప్రాజ్‌ నిగమ్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు. 

కుల్దీప్‌ యాదవ్‌ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్‌ చేశారు. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్‌ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement