పాకిస్తాన్ సూపర్ స్టార్, పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబర్ ఆజం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 4000 పరుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్‌గా ఆజం చరిత్ర సృష్టించాడు. శనివారం కరాచీ వేదికగా లహోర్ ఖలంధర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
బాబర్ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతడి పీఎస్‌ఎల్ కెరీర్‌లో 37 ఫిప్టీలతో పాటు రెండు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత పీఎస్‌ఎల్ సీజన్‌లో బాబర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 70.67 సగటుతో 212 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రనస్కోరర్‌గా బాబర్ కొనసాగుతున్నాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లహోర్‌పై 76 పరుగుల తేడాతో కరాచీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్(48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైఖల్ బ్రేస్‌వెల్(21), మహ్మద్ హ్యారిస్(18) రాణించారు.
లహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మన్ రెండు, ఉబైడ్ షా, ఉసమా మీర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లహోర్.. పెషావర్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ బౌలర్లలో స్పిన్నర్లు మైఖల్ బ్రేస్‌వెల్, సుఫియన్ ముఖియమ్ తలా మూడు వికెట్లతో లహోర్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు షోర్‌ఫుల్ ఇస్లాం, అమీర్ జమీల్ ఓ వికెట్ సాధించారు.
చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే?


