ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో ఆ దేశ స్టార్ బ్యాటర్, పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (ఏప్రిల్ 28) మరో సెంచరీ బాదాడు.
ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచ్‌లో బాబర్ ఉగ్రరూపం దాల్చాడు. 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మిగతా పెషావర్ బ్యాటర్లలో మొహమ్మద్ హరీస్ (35), కుసాల్ మెండిస్ (41), ఆరోన్ హార్డీ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బ్రేస్‌వెల్ (2), అబ్దుల్ సమద్ (0), ఫర్హాన్ (0) నిరాశపరిచారు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ 2, సల్మాన్ మీర్జా, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇదిలా ఉంటే, ఈ సెంచరీతో బాబర్ ఓ ఆల్‌టైమ్ పీఎస్‌ఎల్ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ చరిత్రలో నాలుగు సీజన్లలో (2021, 2023, 2024, 2026) 500 ప్లస్ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుకు సంబంధించి బాబర్ తర్వాతి స్థానంలో మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ పీఎస్‌ఎల్‌లో మూడు సీజన్లలో (2021, 2022, 2023) 500 ప్లస్ పరుగులు సాధించాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 598 పరుగులు చేసి, పీఎస్‌ఎల్ చరిత్రలో ఓ సింగిల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు లాహోర్ ఖలందర్స్ ప్లేయర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. జమాన్ 2022 ఎడిషన్‌లో 588 పరుగులు చేశాడు.


