David Warner: 11 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల అనుభవంతో అరంగేట్రం.. అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే

Aus Vs SA 2nd Test Day 2 Highlights: Warner Double Century Puts Aus Top - Sakshi

Australia vs South Africa, 2nd Test- మెల్‌బోర్న్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 197 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక మూడో రోజు ఆటలో భాగంగా లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 479 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.  290 పరుగుల ఆధిక్యంలో ఉంది.

కాగా మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోవడం గమనార్హం. టెస్టుల్లో 11వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌ను 93.2 ఓవర్లో బౌల్డ్‌ చేసిన నోర్జే.. ఆ మరుసటి బంతికే వార్నర్‌ను కూడా బౌల్డ్‌ చేశాడు. దీంతో అతడి ఖాతాలో మూడో వికెట్‌ చేరింది. అంతకుముందు స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఇక తర్వాతి ఓవర్లో రబడ బౌలింగ్‌లో కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను వెయిర్నే పట్టుకోవడంతో ఆరో వికెట్‌ పడింది. కాగా నాథన్‌ లియాన్‌ ఎంగిడి బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ట్రవిస్‌ హెడ్‌ (51), అలెక్స్‌ క్యారీ (62 నాటౌట్‌), కామెరాన్‌ గ్రీన్‌ (14 పరుగులతో) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో రోజు ఆట విశేషాలు- భారీ భాగస్వామ్యం... 
ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆటలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరడంతో మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి స్థితిలో వార్నర్‌ పట్టుదలగా నిలబడగా, స్మిత్‌ అతనికి సహకరించడం విశేషం. ఈ క్రమంలో 144 బంతుల్లో వార్నర్‌ కెరీర్‌లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై సఫారీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వీరిద్దరు మూడో వికెట్‌కు 239 పరుగులు జోడించారు.

స్మిత్‌ వెనుదిరిగిన కొద్ది సేపటికే వార్నర్‌ డబుల్‌ సెంచరీ పూర్తయింది. అయితే తీవ్ర ఎండలో 63 సింగిల్స్‌ తీసిన వార్నర్‌ 14 సార్లు రెండేసి, 7 సార్లు మూడేసి పరుగులు తీయడంతో పాటు 3 సార్లు నాలుగు పరుగులు కూడా తీశాడు. దాంతో అతను తీవ్రంగా అలసిపోయాడు. డబుల్‌ సెంచరీ పూర్తయ్యాక వార్నర్‌ను ఇరు వైపుల సహచరులు పట్టుకొని బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. 

స్పైడర్‌ క్యామ్‌ దెబ్బ... 
మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆట మధ్యలో దక్షిణాఫ్రికా పేసర్‌ ఆన్రిచ్‌ నోర్జే ఫీల్డింగ్‌లో మరో వైపుకు వెళుతున్న సమయంలో పైన వేలాడుతున్న స్పైడర్‌ క్యామ్‌ ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చి అతని ఎడమ భుజాన్ని, మోచేతిని బలంగా తాకింది. దాంతో నోర్జే మైదానంలో పడిపోయాడు.  అదృష్టవశాత్తూ పెద్ద దెబ్బ తగలకపోవడంతో బతికిపోయిన నోర్జే...స్పైడర్‌ క్యామ్‌ ఇంత కిందకు ఉండటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం ఫాక్స్‌ స్పోర్ట్స్‌ దీనిపై క్షమాపణలు చెప్పింది. 

విమర్శలను దాటి... 
కేప్‌టౌన్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఇంకా అవే సూటిపోటి వ్యాఖ్యలు...కెప్టెన్సీ కావాలంటే కుటుంబంతో సహా విచారణకు రమ్మంటూ సొంత బోర్డునుంచే షరతులు... జనవరి 2020నుంచి టెస్టుల్లోనే సెంచరీ లేకపోగా, గత 10 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు! వార్నర్‌ టెస్టు కెరీర్‌ ముగిసినట్లే అంటూ విమర్శలు వస్తున్న సమయంలో అతను చెలరేగాడు.

తన కెరీర్‌లో 100వ టెస్టును అందుకు సరైన వేదికగా ఎంచుకొని ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు.  టి20, వన్డే స్పెషలిస్ట్‌గానే క్రికెట్‌ ప్రపంచం గుర్తించిన వార్నర్‌ టెస్టుల్లో సాధించిన ఘనతలు తక్కువేమీ  కాదు.  తాజా వివాదాల నేపథ్యంలో మెల్‌బోర్న్‌ టెస్టు ఆరంభానికి ముందు ‘అన్నీ మరచి ఒకప్పటి దూకుడైన వార్నర్‌లా ఆడతాను’ అంటూ వ్యాఖ్యానించిన అతను దానిని నిజం చేసి చూపించాడు.

మంగళవారం అన్ని రకాల మేళవింపుతో అతని బ్యాటింగ్‌ సాగింది. వికెట్ల మధ్య పరుగెత్తడం మొదలు చూడచక్కటి షాట్లు ఆడటం వరకు వార్నర్‌ అలరించాడు. ముఖ్యంగా ప్రమాదకరంగా కనిపించిన నోర్జే, రబడ ఫాస్టెస్ట్‌ బంతులను కూడా సమర్థంగా ఎదుర్కొంటూ పుల్, హుక్‌ షాట్లతో తానేంటో అతను చూపించాడు. మైదానంలో ఫిట్‌నెస్‌పరంగా ప్రతికూల పరిస్థితి కనిపించినా అతను ఎక్కడా తగ్గలేదు.

సెంచరీ పూర్తయ్యాక తనదైన శైలిలో గాల్లోకి ఎగిరి సంబరం జరుపుకున్న వార్నర్‌... డబుల్‌ సెంచరీ తర్వాత భావోద్వేగాలు ప్రదర్శించడం ఈ ఇన్నింగ్స్‌ విలువేమిటో చూపించింది. 110 బంతుల్లోనే వార్నర్‌ తర్వాతి వంద పరుగులు రాబట్టడం విశేషం. కేవలం 11 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల అనుభవంతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్‌ ఈ ఫార్మాట్‌లలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

వార్నర్‌ రికార్డుల మోత
తన రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 123 నాటౌట్, పెర్త్‌లో భారత్‌పై 180, కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా పై 134, 145,  పాకిస్తాన్‌పై దుబాయ్‌లో 133, మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై 112, అడిలైడ్‌లో పాకిస్తాన్‌పై చేసిన 335 నాటౌట్‌ అతని కెరీర్‌లో కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలుగా నిలిచాయి. 
►100వ టెస్టులో సెంచరీ చేసిన 10వ ఆటగాడిగా (కౌడ్రీ, మియాందాద్, గ్రీనిడ్జ్, స్టివార్ట్, ఇంజమామ్,పాంటింగ్, గ్రేమ్‌ స్మిత్, ఆమ్లా, రూట్‌ తర్వాత) వార్నర్‌ నిలిచాడు.

►పాంటింగ్‌ ఒక్కడే రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేయగా... రూట్, వార్నర్‌ మాత్రమే వాటిని డబుల్‌ సెంచరీలుగా మలిచారు. ఓవరాల్‌గా వార్నర్‌ 100 టెస్టుల్లో 46.67 సగటుతో 8122 పరుగులు చేశాడు.
చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! సూర్యకుమార్‌కు కీలక బాధ్యతలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top