
4 వికెట్లతో శ్రీలంక చిత్తు
రాణించిన సైఫ్, తౌహీద్, ముస్తఫిజుర్
ఆసియా కప్ సూపర్–4 మ్యాచ్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. లీగ్ దశలో తమను చిత్తు చేసిన శ్రీలంకను చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 4 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
దసున్ షనక (37 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లతో లంకను దెబ్బ తీయగా, మెహదీ హసన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. సైఫ్ హసన్ (), తౌహీద్ హృదయ్ () అర్ధ సెంచరీలతో జట్టును గెలిపించారు.
బ్యాటింగ్ తడబాటు...
శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 30 బంతుల్లో 44 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలో మెండిస్, కామిల్ వెనుదిరిగారు. ఈ దశలో క్రీజ్‌లోకి వచి్చన షనక జట్టును ఆదుకున్నాడు. ఫోర్‌తో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అతను ఆ తర్వాతా జోరు కొనసాగించాడు.
కుశాల్ పెరీరా (16) వెనుదిరిగిన తర్వాత షనక, కెపె్టన్ అసలంక (21) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నసుమ్ ఓవర్లో షనక ఒక ఫోర్, 2 భారీ సిక్స్‌లతో చెలరేగగా, తస్కీన్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతులను అసలంక సిక్స్, ఫోర్‌గా మలిచాడు. షరీఫుల్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన షనక 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్ భాగస్వామ్యం 57 పరుగులకు (27 బంతుల్లో) చేరిన తర్వాత దురదృష్టవశాత్తూ అసలంక రనౌట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో కమిందు (1), హసరంగ (2)లను ముస్తఫిజుర్ అవుట్ చేశాడు. తస్కీన్ వేసిన ఆఖరి ఓవర్లో షనక ఫోర్, సిక్స్‌తో స్కోరును 160 దాటించాడు.
కీలక భాగస్వామ్యాలు...
తొలి ఓవర్లోనే తన్జీద్ హసన్ (0) అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఛేదన పేలవంగా మొదలైంది. అయితే సైఫ్, కెపె్టన్ లిటన్ దాస్ (16 బంతుల్లో 23; 3 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లేలో స్కోరు 59 పరుగులకు చేరింది. సైఫ్ వరుసగా మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్‌తో ధాటిని ప్రదర్శించగా, చమీరా ఓవర్లో దాస్ 2 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 34 బంతుల్లో 59 పరుగులు జోడించారు. అనంతరం తౌహీద్‌తో సైఫ్ భాగస్వామ్యం కొనసాగింది.
36 బంతుల్లోనే సైఫ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి హసరంగ బౌలింగ్‌లో సైఫ్ వెనుదిరిగాడు. మూడో వికెట్‌కు సైఫ్, తౌహీద్ 45 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. కమిందు ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది తౌహీద్ బంగ్లాను వేగంగా లక్ష్యం దిశగా నడిపించాడు. 31 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. విజయానికి 10 పరుగుల దూరంలో తౌహీద్ అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ ఎదురైనా, చివరకు బంగ్లా గట్టెక్కింది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) సైఫ్ (బి) తస్కీన్ 22; కుశాల్ మెండిస్ (సి) సైఫ్ (బి) మెహదీ 34; కామిల్ (బి) మెహదీ 5; కుశాల్ పెరీరా (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 16; షనక (నాటౌట్) 64; అసలంక (రనౌట్) 21; కమిందు మెండిస్ (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 1; హసరంగ (సి) తన్జీద్ (బి) ముస్తఫిజుర్ 2; వెలలాగె (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168.
వికెట్ల పతనం: 1–44, 2–58, 3–65, 4–97, 5–154, 6–156, 7–158.
బౌలింగ్: షరీఫుల్ 4–0–49–0, నసుమ్ 4–0–36–0, తస్కీన్ 4–0–37–1, మెహదీ హసన్ 4–0–25–2, ముస్తఫిజుర్ 4–0–20–3.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సైఫ్ హసన్ (సి) వెలలాగె (బి) హసరంగ 61; తన్జీద్ (బి) తుషార 0; లిటన్ దాస్ (సి) నిసాంక (బి) హసరంగ 23; తౌహీద్ (ఎల్బీ) (బి) చమీరా 58; షమీమ్ (నాటౌట్) 14; జాకీర్ (బి) షనక 9; మెహదీ హసన్ (సి) కుశాల్ మెండిస్ (బి) షనక 0; నసుమ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 169.
వికెట్ల పతనం: 1–1, 2–60, 3–114, 4–159, 5–168, 6–168.
బౌలింగ్: నువాన్ తుషార 4–0–42–1, చమీరా 4–0–32–1, వెలలాగె 4–0–36–0, హసరంగ 4–0–22–2, షనక 2.5–0–21–2, కమిందు 1–0–16–0.