SL vs AFG: ఓవైపు చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌.. ఇంతలోనే తీవ్ర విషాదం | Asia Cup SL Vs AFG: Sri Lanka Star Dunith Wellalage Father Dies Mid Match Informed Later, His Emotional Video Went Viral | Sakshi
Sakshi News home page

Asia Cup: శ్రీలంక స్టార్‌ ఇంట్లో విషాదం.. మ్యాచ్‌ మధ్యలోనే తండ్రి మరణం

Sep 19 2025 9:31 AM | Updated on Sep 19 2025 10:58 AM

Asia Cup SL vs AFG: Sri Lanka Star Father Dies Mid Match Informed Later

శ్రీలంక యువ క్రికెటర్‌ దునిత్‌ వెల్లలగే (Dunith Wellalage) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దునిత్‌ తండ్రి సురంగ వెల్లలగే హఠాన్మరణం చెందారు. ఆసియా కప్‌-2025 టోర్నీలో భాగంగా శ్రీలంక- అఫ్గనిస్తాన్‌తో చావో రేవో తేల్చుకునేందుకు తలపడుతున్న వేళ ఈ వార్త తెలిసింది.

అయితే, మ్యాచ్‌ ముగిసేంత వరకు దునిత్‌ వెల్లలగేకు తండ్రి మరణం గురించి తెలియనివ్వలేదు. అఫ్గన్‌పై లంక గెలుపొందిన తర్వాత హెడ్‌కోచ్‌ సనత్‌ జయసూర్య దునిత్‌కు ఈ విషయం చెప్పాడు. దీంతో అతడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.

నో సెలబ్రేషన్స్‌
ఈ విషయం గురించి శ్రీలంక మాజీ క్రికెటర్‌ రసెల్‌ ఆర్నాల్డ్‌ సోనీ స్పోర్ట్స్‌తో గురువారం రాత్రి మాట్లాడుతూ.. ‘‘దునిత్‌ వెల్లలగే తండ్రి సురంగ కొద్ది సేపటి క్రితమే మరణించారు. ఆయన కూడా ఒకప్పుడు క్రికెట్‌ ఆడేవారు. మా స్కూల్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఉండేవారు.

ఆయన మరణ వార్త తెలియగానే నా మనసు బాధతో నిండిపోయింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత దునిత్‌కు ఈ విషయం చెప్పారు. అతడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. అందుకే అఫ్గన్‌పై విజయాన్ని లంక ఆటగాళ్లు సెలబ్రేట్‌ చేసుకోలేదు’’ అని వెల్లడించాడు.

కుమారుడి ద్వారా నెరవేరిన కల
కాగా పాఠశాల, కాలేజీ స్థాయిలో క్రికెట్‌ ఆడిన సురంగ వెల్లలగే జాతీయ జట్టుకు మాత్రం ఎప్పుడూ ప్రాతినిథ్యం వహించలేకపోయారు. కుమారుడు దునిత్‌ ద్వారా తన కలను నెరవేర్చుకున్నారు. ఇరవై రెండేళ్ల దునిత్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌.

శ్రీలంక 2022లో తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 31 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన దునిత్‌.. వన్డేల్లో 39, టీ20లలో ఏడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా.. వన్డేల్లో 386 పరుగులతో సత్తా చాటాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.

సూపర్‌-4కు అర్హత సాధించిన శ్రీలంక
దుబాయ్‌ వేదికగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక మెరుగైన ప్రదర్శనతో రాణించింది. టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన లంక జట్టు.. అఫ్గన్‌ను 169 పరుగులకు కట్టడి చేసింది. మహ్మద్‌ నబీ (22 బంతుల్లో 60) మెరుపుల కారణంగా అఫ్గనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించగలిగింది. 

లంక బౌలర్లలో నువాన్‌ తుషార నాలుగు వికెట్లతో చెలరేగగా.. దుష్మంత చమీర, వెల్లలగే, దసున్‌ శనక ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో పని పూర్తి చేసింది. ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకం (52 బంతుల్లో 74 నాటౌట్‌)తో అలరించగా.. కుశాల్‌ పెరీరా (28), కమిందు మెండిస్‌ (13 బంతుల్లో 26 నాటౌట్‌) కూడా రాణించారు. 

ఈ క్రమంలో ఆరు వికెట్ల తేడాతో అఫ్గన్‌పై గెలుపొందిన శ్రీలంక.. గ్రూప్‌-బి నుంచి సూపర్‌ ఫోర్‌కు అర్హత సాధించింది. ఇక ఇదే గ్రూపు నుంచి బంగ్లాదేశ్‌ కూడా తమ బెర్తును ఖరారు చేసుకోగా.. అఫ్గన్‌, హాంకాంగ్‌ ఎలిమినేట్‌ అయ్యాయి.  

చదవండి: IND VS AUS: శతక్కొట్టిన ధృవ్‌ జురెల్‌.. టీమిండియా భారీ స్కోర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement