
PC: UAE X
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తమ జట్టును ప్రకటించింది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి పదిహేడు మంది సభ్యులను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. ముహమ్మద్ వసీం కెప్టెన్సీలో యూఏఈ ఈ టోర్నీ ఆడనుంది. ఇందులో ఆర్యాంశ్ శర్మ (Aryansh Sharma), ధ్రువ్ పరాశర్, రాహుల్ చోప్రా (Rahul Chopra) తదితర భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు.
ఆతిథ్య హక్కులు భారత్‌వి.. వేదిక యూఏఈ
కాగా ఈ ఖండాంతర ఈవెంట్ ఆతిథ్య హక్కులను ఈసారి భారత్ దక్కించుకుంది. అయితే, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో భాగమైనందున గత ఒప్పందం ప్రకారం.. తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యూఏఈలో ఆసియా కప్ టోర్నీని పూర్తి చేయనుంది.
ఈ టోర్నమెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.
సూపర్ ఫోర్ దశకు చేరాలంటే..
ఇక సొంతగడ్డపై టోర్నీ జరుగనుండటం యూఏఈకి సానుకూలాంశంగా మారనుంది. భారత్, పాకిస్తాన్, ఒమన్‌లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉన్న యూఏఈ.. లీగ్ దశలో కనీసం రెండు గెలిస్తే సూపర్ ఫోర్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది.
టీమిండియా వంటి పటిష్ట జట్టుపై గెలిచే అవకాశం లేకపోయినా.. ప్రస్తుతం బలహీనంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు పసికూన ఒమన్‌పై గెలవడం ద్వారా యూఏఈ తన కలను నెరవేర్చుకోవచ్చు.
ఇక సెప్టెంబరు 10న టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా ఆసియా కప్ టోర్నీలో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న యూఏఈ.. తదుపరి సెప్టెంబరు 17న పాకిస్తాన్‌తో తలపడనుంది.
కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
ఆ మరుసటి రోజే ఒమన్ జట్టుతో యూఏఈ మ్యాచ్ ఆడుతుంది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఇటీవలే యూఏఈ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఆసియా కప్ టోర్నీలో లాల్‌చంద్ ఆ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా యూఏఈ ప్రస్తుతం.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌లతో కలిసి టీ20 ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి పాకిస్తాన్, అఫ్గన్ జట్ల చేతిలో ఓడిపోయింది. అయితే, మెగా టోర్నీకి ముందు కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం లభించింది.
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు యూఏఈ జట్టు ఇదే
ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.
చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్