
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 20) జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించాడు.
షకీబ్ 129 మ్యాచ్‌ల్లో 13 హాఫ్ సెంచరీల సాయంతో 2551 పరుగులు చేయగా.. దాస్ 114 మ్యాచ్‌ల్లో 15 హాఫ్ సెంచరీల సాయంతో 2556 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (4231) పేరిట ఉంది.
ముస్తాఫిజుర్ మరో వికెట్ దూరంలో..!
శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు వరకు బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డులు షకీబ్ అల్ హసన్ పేరిట సోలోగా ఉండేవి. ఈ మ్యాచ్‌లో షకీబ్ పేరిట ఉండిన అత్యధిక పరుగుల రికార్డును లిట్టన్ దాస్ బద్దలు కొట్టగా.. ఇదే మ్యాచ్‌లో షకీబ్ పేరిటే ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును ముస్తాఫిజుర్ రెహ్మాన్ సమం చేశాడు.
లంకతో మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన తర్వాత ముస్తాఫిజుర్, షకీబ్ తలో 149 వికెట్లతో సమంగా ఉన్నారు. ముస్తాఫిజుర్ మరో వికెట్ తీస్తే బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తాడు.