సబలెంకా, గాఫ్‌ జోరు.. మెద్వెదెవ్‌కు షాక్‌ | Aryna Sabalenka Enters 2nd Round French Open Grandslam 2026 | Sakshi
Sakshi News home page

French Open 2026: సబలెంకా, గాఫ్‌ జోరు.. మెద్వెదెవ్‌కు షాక్‌

May 27 2026 9:26 AM | Updated on May 27 2026 10:53 AM

Aryna Sabalenka Enters 2nd Round French Open Grandslam 2026

పారిస్‌: మండే ఎండల్లో సాగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా తన ఆటతీరుతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారూస్‌) 6–4, 6–2తో జెస్సికా బుజాస్‌ మనీరో (స్పెయిన్‌)పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 

రెండు డైమండ్‌ నెక్లెస్‌లు ధరించి ఈ మ్యాచ్‌లో అడుగు పెట్టిన సబలెంకా 75 నిమిషాల్లో ప్రత్యర్థిని ఓడించింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన సబలెంకా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. 29 విన్నర్స్‌ కొట్టిన గత ఏడాది రన్నరప్, నెట్‌ వద్ద 13 పాయింట్లు సాధించింది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్, నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది.

తొలి రౌండ్‌లో కోకో గాఫ్‌ 6–4, 6–0తో తన దేశానికే చెందిన టేలర్‌ టౌన్‌సెండ్‌ను ఓడించింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన నయోమి ఒసాకా (జపాన్‌) కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో ఒసాకా 6–3, 7–6 (7/3)తో లౌరా సిగెముండ్‌ (జర్మనీ)పై గెలిచింది.  

మెద్వెదెవ్‌ అవుట్‌ 
పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఆడమ్‌ వాల్టన్‌ (ఆ్రస్టేలియా) 3 గంటల 22 నిమిషాల్లో 6–2, 1–6, 6–1, 1–6, 6–4తో మెద్వెదెవ్‌ను బోల్తా కొట్టించాడు. మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన 17 ఏళ్ల మోయిస్‌ కువామె తొలి రౌండ్‌లో 7–6 (7/4), 6–2, 6–1తో 37 ఏళ్ల మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా 1991 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో మ్యాచ్‌ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా మోయిస్‌ గుర్తింపు పొందాడు.

రెండో రౌండ్‌లో యూకీ–వీనస్‌ జోడీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, శ్రీరామ్‌ బాలాజీ వేర్వేరు భాగస్వాములతో శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ–మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌) జోడీ 7–5, 6–2తో ఫ్రాన్సిస్కో సెరన్‌డోలో–మరియానో కెస్టెల్‌బోయిమ్‌ (అర్జెంటీనా) జంటపై గెలిచింది. శ్రీరామ్‌ బాలాజీ–మార్సెలో డెమోలైనర్‌ (బ్రెజిల్‌) ద్వయం 6–3, 4–6, 6–3తో రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌)–కాన్‌స్టన్‌టీన్‌ ఫ్రాంట్‌జెన్‌ (జర్మనీ) జంటపై విజయం సాధించింది.   

చదవండి: గుజరాత్‌పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement