ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన అర్జున్‌ టెండుల్కర్‌

Arjun Tendulkar Five Sixes In Single Over Picks 3 Wickets - Sakshi

ముంబై: టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ చెలరేగిపోయి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీఏ) స్థానికంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో అర్జున్‌ టెండుల్కర్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఎమ్‌ఐజీ క్రికెట్‌ క్లబ్‌- ఇస్లాం జింఖానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎమ్‌ఐజీ తరఫున మైదానంలో దిగిన అతడు.. తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కాగా తొలుత బ్యాటింగ్‌ దిగిన ఎమ్‌ఐజీ క్రికెట్‌ క్లబ్‌ జట్టు.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ప్రగ్నేశ్‌ కందీలెవార్‌ సెంచరీ చేయగా, మరో ఆటగాడు కెవిన్‌ 96 పరుగుల వద్ద నిలిచిపోయాడు. ఇక అర్జున్‌ టెండుల్కర్‌ 31 బంతుల్లోనే 77 పరుగులు చేసి వహ్వా అనిపించాడు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆఫ్‌ స్పిన్నర్‌ హషీర్‌ దఫేదార్‌ వేసిన ఓవర్‌లోనే ఐదు సిక్స్‌లు బాదాడు. ఈ ముగ్గురి భారీ ఇన్నింగ్స్‌తో ఎమ్‌ఐజీ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది.
(చదవండి: ఇప్పుడేమంటారు: అశ్విన్‌ భార్య)

ఈ క్రమంలో బ్యాటింగ్‌ దిగిన జింఖానా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు 191 పరుగులకే ఆలౌట్‌ అయి 194 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. అర్జున్‌ టెండుల్కర్‌, అంకుశ్‌ జైస్వాల్‌. శ్రేయస్‌ గౌరవ్ మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. కాగా క్యాష్‌ రిచ్‌లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో భాగంగా అర్జున్‌ ఇటీవల తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో రిజిస్టర్‌ చేసుకున్న అర్జున్‌, మరో మూడు రోజుల్లో ఆటగాళ్ల వేలం జరుగనున్న వేళ ఈ మేరకు పొట్టి ఫార్మాట్‌ తరహాలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడటం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top