
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణం
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం లభించింది. రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్‌లతో కూడిన భారత జట్టు 1892.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని గెల్చుకుంది. రుద్రాంక్ష్ 632.3 పాయింట్లు, అర్జున్ 631.6 పాయింట్లు, అంకుశ్ 628.6 పాయింట్లు స్కోరు చేశారు.
అయితే వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ 207.6 పాయింట్లతో నాలుగో స్థానంలో, అర్జున్ 185.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. సత్పయేవ్ (కజకిస్తాన్; 250.1 పాయింట్లు) స్వర్ణం... లూ డింగ్‌కి (చైనా; 249.8 పాయింట్లు) రజతం... హజున్ పార్క్ (కొరియా; 228.7 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగంలో భారత్‌కే స్వర్ణాలు దక్కాయి.
వ్యక్తిగత విభాగంలో అభినవ్ షా 250.4 పాయింట్లతో పసిడి పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో అభినవ్, హిమాంశు, ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 1890.1 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గింది. జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్‌లో మాన్సి స్వర్ణం, యశస్వి రజతం... జూనియర్ పురుషుల స్కీట్ ఈవెంట్‌లో హర్‌మెహర్ రజతం, జ్యోతిరాదిత్య సిసోడియా కాంస్యం గెలిచారు. హర్‌మెహర్, జ్యోతిరాదిత్య, అతుల్‌లతో కూడిన బృందం టీమ్ స్కీట్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా భారత్ 16 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో 31 పతకాలతో ‘టాప్’లో ఉంది.