ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరు.. కోహ్లిపై రాయుడు ఫైర్‌!? | Sakshi
Sakshi News home page

ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరు.. కోహ్లిపై రాయుడు ఫైర్‌!?

Published Mon, May 27 2024 9:23 PM

Ambati Rayudu takes sly dig at Virat Kohli

ఐపీఎల్‌-2024 ఛాంపియ‌న్స్‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం చెపాక్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను చిత్తు చేసి కేకేఆర్ ముచ్చ‌ట‌గా మూడో సారి టైటిల్‌ను ఎగ‌రేసుకుపోయింది. 

అయితే కేకేఆర్ విజ‌యం అనంత‌రం మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాట‌ర్ అంబ‌టి రాయుడు.. సంబంధం లేకుండా ఆర్సీబీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చాడు.  అంతేకాకుండా ఆర్సీబీ స్టార్‌ విరాట్ కోహ్లిని రాయుడు మ‌రోసారి టార్గెట్ చేశాడు. 

ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్‌ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్‌గా నిలబెడుతాయని ప‌రోక్షంగా కోహ్లిపై రాయుడు విమ‌ర్శ‌లు గుప్పించాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో నిష్క్ర‌మించిన‌ప్ప‌ట‌కి.. ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ విరాట్ కోహ్లి త‌న ప్ర‌ద‌ర్శ‌నతో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 61.75 స‌గ‌టుతో 741 ప‌రుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా విరాట్ నిలిచాడు.

ఛాంపియ‌న్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు కంగ్రాట్స్‌. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది. ఈ దిగ్గ‌జాలు జట్టు విజయాల్లో త‌మ వంతు పాత్ర పోషించేలా సపోర్ట్ చేసింది.

ఐపీఎల్‌లో ఓ జట్టు గెలుపొందాలంటే స‌మిష్టి కృషి అవసరం. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300  లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోందని"జియో సినిమా షోలో రాయుడు పేర్కొన్నాడు. 

కాగా విరాట్‌పై రాయుడు విమర్శల గుప్పించం ఇదేమి తొలిసారి కాదు.  ఎలిమేనిటర్‌లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత కూడా విరాట్‌ను పరోక్షంగా ఉద్దేశించి రాయుడు ఓ పోస్ట్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం టీమ్‌కు మంచిది కాదుంటా రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement