తెలంగాణ క్రికెట్‌లో కొత్త శ‌కం.. ఏఐతో ఆటగాళ్ల ఎంపిక! | Ambati Rayudu-Launch Telangana Premier Legue AI Used For Players Selection | Sakshi
Sakshi News home page

Telangana Premier League: తెలంగాణ క్రికెట్‌లో కొత్త శ‌కం.. ఏఐతో ఆటగాళ్ల ఎంపిక!

May 11 2026 10:17 PM | Updated on May 11 2026 10:34 PM

Ambati Rayudu-Launch Telangana Premier Legue AI Used For Players Selection

సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహిస్తున్న‌ట్లు మాజీ క్రికెట‌ర్‌ అంబటి రాయుడు తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, సీఈఓ ఇంతియాజ్ అలీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

సోమ‌వారం ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో టీపీఎల్ వివరాల‌ను వెల్ల‌డించారు. హెచ్‌సీఏ సెక్ర‌ట‌రీ మ‌న్నె జీవ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో పది మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్‌సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి వెల్లడించారు. 

వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దీని ద్వారా నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, సెలెక్షన్కు సంబంధించిన ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న అంబటి రాయుడు, అదే తరహాలో హెచ్.సీఏ ఆధ్వర్యంలో కూడా పారదర్శకంగా లీగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. 

ఓపెన్ ట్రయల్స్, లీగ్ మ్యాచ్ ల నిర్వహణను మరింత విస్తృతంగా చేపడుతున్నామని, ప్రతి నిర్ణయం నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే లీగ్ లకు సంబంధించిన తుది నిర్ణయాలను సెలెక్షన్ కమిటీ తీసుకుంటుందని, ఆటగాళ్లు, అంపైర్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement