Ajit Agarkar: టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు అవసరమంటున్న భారత మాజీ బౌలర్‌ 

Ajit Agarkar Wants Rishabh Pant To Open Innings In 1st ODI Vs West Indies - Sakshi

 first ODI against the West Indies: ఫిబ్రవరి 6 నుంచి విండీస్‌తో ప్రారంభంకావాల్సి ఉన్న పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పలు మార్పులు అవసరమంటున్నాడు భారత మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌. ఈ సిరీస్‌లో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా టీమిండియాను వేధిస్తున్న మిడిల్ ఆర్డర్ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని సూచిస్తూ.. వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు ప్రమోషన్‌ కల్పించి ఓపెనర్‌ పంపాలని జట్టు యాజమాన్యాన్ని కోరాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జతగా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ను కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నాడు. 

దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్‌ రాహుల్‌.. కెప్టెన్‌గానే కాకుండా ఓపెనర్‌గా కూడా తీవ్రంగా నిరాశపర్చాడని ప్రస్తావించాడు. శిఖర్‌ ధవన్‌ కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఓపెనర్ల సమస్య మరింత జటిలమవుతుందని, బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో జట్టు యాజమాన్యం పునరాలోచించి కేఎల్‌ రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపితే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 

కేఎల్‌ రాహుల్‌ను 4 లేదా 5 స్ధానాల్లో పంపించడం ద్వారా మిడిలార్డర్‌ డెప్త్‌ పెరుగుతుందని, ఇది కచ్చితంగా జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌గా(12 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 613 పరుగులు) రాహుల్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన అగార్కర్‌.. వన్డే ప్రపంచకప్ 2023ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే జట్టు కూర్పులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు.  కాగా, ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగాల్సి​ ఉంది. 
చదవండి: హైదరాబాద్‌లో ధోని క్రికెట్‌ అకాడమి ప్రారంభం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top