ముంబై తొలి ఇన్నింగ్స్ 251/5
ఛత్తీస్‌గఢ్‌తో రంజీ మ్యాచ్
ముంబై: భారత టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలని భావిస్తున్న సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే... రంజీ ట్రోఫీలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ అజింక్య రహానే (237 బంతుల్లో 118; 15 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... సిద్ధేశ్ లాడ్ (146 బంతుల్లో 80; 13 ఫోర్లు) ఫిఫ్టీతో మెరిశాడు.
సెంచరీ అనంతరం రహానే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ముషీర్ ఖాన్ (12), అంగ్‌క్రిష్ రఘువంశీ (9), హిమాన్షు సింగ్ (0), సర్ఫరాజ్ ఖాన్ (1) విఫలమయ్యారు. షమ్స్ ములానీ (25 బ్యాటింగ్), ఆకాశ్ ఆనంద్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో రవికిరణ్, ఆదిత్య సర్వతే చెరో 2 వికెట్లు పడగొట్టారు.
విమల్, ప్రదోశ్ సెంచరీలు
నాగాలాండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’మ్యాచ్‌లో తమిళనాడు బ్యాటర్లు విజృంభించారు. విమల్ కుమార్ (224 బంతుల్లో 189; 28 ఫోర్లు), ప్రదోశ్ రంజన్ పాల్ (252 బంతుల్లో 156 బ్యాటింగ్; 19 ఫోర్లు) భారీ సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
నాగాలాండ్ బౌలర్ల అనుభవలేమిని వినియోగించుకున్న తమిళనాడు బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఓపెనర్ అతీశ్ (14) ఆరంభంలోనే అవుట్ కాగా... ఆ తర్వాత విమల్, ప్రదోశ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. ముఖ్యంగా విమల్ కుమార్ వన్డే తరహా బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు.
ఈ క్రమంలో ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. మరో గంటలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా... విమల్ పెవిలియన్ చేరగా... అండ్రె సిద్ధార్థ్ (30 బ్యాటింగ్)తో కలిసి ప్రదోశ్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు. గత మ్యాచ్‌లో జార్ఖండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన తమిళనాడు బ్యాటర్లు... నాగాలాండ్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు.
రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ
భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (163 బంతుల్లో 116; 15 ఫోర్లు) రాణించడంతో మహారాష్ట్ర జట్టు ఓ మోస్తరు స్కోరు చేసింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం ప్రారంభమైన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 85.5 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. సౌరభ్ నవాలె (122 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్), అర్షిన్ కులకర్ణి (55 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు సాధించారు.
పృథ్వీ షా (8), సిద్ధేశ్ వీర్ (7), కెప్టెన్ అంకిత్ బావే (8), జలజ్ సక్సేనా (1) విఫలమయ్యారు. చండీగఢ్ బౌలర్లలో జగ్‌జీత్ సింగ్, అభిషేక్ సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టగా... విషు కశ్యప్, రమణ్ బిష్ణోయ్ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
విదర్భ మ్యాచ్‌కు వర్షం ఆటంకం
డిఫెండింగ్ చాంపియన్ విదర్భ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం ప్రారంభమైన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది.
ఓపెనర్లు శిఖర్ మోహన్ (127 బంతుల్లో 60 బ్యాటింగ్; 5 ఫోర్లు), శరణ్‌దీప్ సింగ్ (101 బంతుల్లో 46 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. విదర్భ బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. గత మ్యాచ్‌లో విదర్భ జట్టు నాగాలాండ్‌పై ఇన్నింగ్స్ విజయం సాధించగా... మరోవైపు జార్ఖండ్ జట్టు తమిళనాడుపై ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది.
మెరిసిన కరుణ్, అర్జున్
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా కర్ణాటక, గోవా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ నాయర్, అర్జున్ టెండూల్కర్ ఆకట్టుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
టీమిండియా ప్లేయర్ కరుణ్ నాయర్ (138 బంతుల్లో 86 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ సాధించగా... శ్రేయస్ గోపాల్ (48 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), అభినవ్ మనోహర్ (37) ఫర్వాలేదనిపించారు. గోవా బౌలర్లలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ 47 పరుగులిచ్చి 3 వికెట్లుపడగొట్టాడు.
సౌరాష్ట్ర 258/8
చాన్నాళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (62 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (138 బంతుల్లో 82; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌కాగా... అన్‡్ష గోసాయ్ (38), హారి్వక్ (26), అర్పిత్ (24), సమర్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4 వికెట్లు పడగొట్టాడు.
ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ బౌలర్లు చరిత్ర సృష్టించారు. అర్జున్ శర్మ, మోహిత్ జాంగ్రా హ్యాట్రిక్‌లతో విజృంభించారు. సుదీర్ఘ చరిత్ర గల రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్ నమోదు చేయడం ఇదే తొలిసారి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అస్సాం... తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.
ప్రద్యున్ సైకియా (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. సర్వీసెస్ బౌలర్లలో అర్జున్ శర్మ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు పడగొట్టగా... మోహిత్ జాంగ్రా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం సర్వీసెస్ 29.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. ఇర్ఫాన్ ఖాన్ (51) హాఫ్ సెంచరీ సాధించగా... అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 5 వికెట్లు, రాహుల్ సింగ్ 4 వికెట్లు తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 21 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. మొత్తంగా ఈ పోరులో తొలి రోజే 25 వికెట్లు నేలకూలాయి.
» ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ ‘ఎ’మ్యాచ్‌లో ఒడిశా జట్టు 243 పరుగులకు ఆలౌటైంది. సందీప్ పట్నాయక్ (53), గోవింద (64), సంబిత్ బరాల్ (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
» కేరళతో జరుగుతున్న గ్రూప్ ‘బి’మ్యాచ్‌లో పంజాబ్ 87 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. హర్‌నూర్ సింగ్ (259 బంతుల్లో 126 బ్యాటింగ్; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు.
» ఈ సీజన్‌లో త్రిపుర తరఫున ఆడుతున్న హనుమ విహారి (110 బంతుల్లో 33), విజయ్ శంకర్ (5)మరోసారి విఫలమయ్యారు. ఫలితంగా హర్యానాతో మ్యాచ్‌లో త్రిపుర జట్టు 126 పరుగులకే ఆలౌటైంది. అనంతరం హర్యానా 39 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
» గుజరాత్‌తో గ్రూప్ ‘సి’మ్యాచ్‌లో బెంగాల్ 72 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. అభిõÙక్ పొరెల్ (51), సుమంత గుప్తా (58 బ్యాటింగ్), సుదీప్ కుమార్ (56) హాఫ్‌సెంచరీలతో రాణించారు.
» ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రైల్వేస్ 89 ఓవర్లలో 4 వికెట్లకు 233 పరుగులు చేసింది. మొహమ్మద్ సైఫ్ (166 బంతుల్లో 99 బ్యాటింగ్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అదరగొట్టాడు.
» జమ్మూకశ్మీర్‌తో గ్రూప్ ‘డి’మ్యాచ్‌లో రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మహిపాల్ లోమ్రర్ (37 నాటౌట్) టాప్ స్కోరర్. జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
» హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న పోరులో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్ (79; 8 ఫోర్లు), అర్పిత్ రాణా (64; 10 ఫోర్లు), యశ్ ధుల్ (61; 11 ఫోర్లు), ఆయుశ్ (51 బ్యాటింగ్) హాఫ్
సెంచరీలతో రాణించారు.


