టెస్ట్, వన్డే జట్ల నుంచి ఉద్వాసనకు గురైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne).. స్వదేశవాలీ సీజన్‌లో చెలరేగిపోతున్నాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సహా 679 పరుగులు చేసి సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు.
యాషెస్ జట్టులో స్థానమే లక్ష్యంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న లబూషేన్.. తాజాగా న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (వన్డే కప్-2025) 111 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 101 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో లబూషేన్ బంతితోనూ సత్తా చాటాడు. జాతీయ జట్టు సహచరుడు క్రిస్ గ్రీన్ సహా 2 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో లబూషేన్ క్వీన్స్‌లాండ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మొత్తంగా లబూషేన్‌కు లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇది ఆరో శతకం. ప్రస్తుత వన్డే కప్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఇది మూడవది.
ప్రస్తుత స్వదేశవాలీ సీజన్‌లో లబూషేన్ లిస్ట్-ఏ ఫార్మాట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ చెలరేగిపోతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టస్మానియా, సౌత్ ఆస్ట్రేలియాపై శతకాలు నమోదు చేశాడు.
ఆగస్ట్‌లో సౌతాఫ్రికాతో జరిగిన స్వదేశీ వన్డే సిరీస్‌కు ముందు లబూషేన్‌పై వేటు పడింది. అప్పటి నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో జట్టులో చోటు కోల్పోయాడు. 31 లబూషేన్ ప్రస్తుత అరివీర భయంకరమైన ఫామ్‌కు ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాలాకాలం పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు.
ప్రస్తుతం లబూషేన్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే యాషెస్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. యాషెస్ సిరీస్ 2025-26 నవంబర్ 21 నుంచి మొదలవుతుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది.
ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్ట్‌కు స్టీవ్ స్మిత్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
