'రెండేళ్ల నిషేధం సరిపోదు'.. బెన్ డ‌కెట్‌పై గ‌వాస్క‌ర్ ఫైర్‌ | Sunil Gavaskar Asks BCCI For Stricter Punishment To IPL Defaulters, Ben Duckett Withdraws From IPL 2026, Faces Two Year Ban | Sakshi
Sakshi News home page

IPL 2026: 'రెండేళ్ల నిషేధం సరిపోదు'.. బెన్ డ‌కెట్‌పై గ‌వాస్క‌ర్ ఫైర్‌

Mar 29 2026 5:22 PM | Updated on Mar 29 2026 6:38 PM

2 Year Not Working, Sunil Gavaskar Asks BCCI For Stricter Punishment To IPL Defaulters

ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ ఐపీఎల్‌-2026 సీజ‌న్ నుంచి ఆఖ‌రి నిమిషంలో త‌ప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది జ‌రిగిన వేలంలో రూ. 2 కోట్లకు డ‌కెట్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ రాహుల్‌తో క‌లిసి డ‌కెట్ ప్రారంభిస్తాడ‌ని అంతా భావించారు. కానీ డ‌కెట్ మాత్రం అనుహ్యంగా ఈ ఏడాది సీజ‌న్ నుంచి వైదొలిగి ఢిల్లీకి గ‌ట్టి షాకిచ్చాడు. ఇంగ్లండ్ త‌ర‌పున టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డకెట్ తెలిపాడు.

ఈ ఇంగ్లీష్ ఓపెనర్ ఐపీఎల్‌కు బదులుగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడనున్నాడు. కాగా బీసీసీఐ గతేడాది తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఏ విదేశీ ఆటగాడైనా, సరైన వైద్య కారణాలు లేకుండా టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకుంటే వారిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. దీంతో డకెట్ రెండేళ్ల ఐపీఎల్‌ బ్యాన్‌ను ఎదుర్కోనున్నాడు.

తాజాగా ఇదే విష‌యంపై భార‌త మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ తీవ్రంగా స్పందించారు. చివరి నిమిషంలో వైదొలగే విదేశీ ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం పెద్దగా ప్రభావం చూపడం లేదని గవాస్కర్ అన్నారు.

"బెన్ డకెట్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బే. ఎందుకంటే అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ది హండ్రెడ్ లీగ్ వేలంలో అతడికి మంచి ధర దక్కడంతో ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను వదులుకోవడానికి సిద్దమయ్యాడు. 

ఒకవేళ అతడికి నామమాత్రపు ధర దక్కి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. వేలంలో ఒక ఆటగాడిని నమ్మి కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, సదరు ఆటగాడు ఆకస్మికంగా తప్పుకుంటే జట్టు ప్రణాళికలపై కచ్చితంగా ప్రభావం చూపుతోంది. అందుకే ఆటగాళ్లకు భయం కలిగేలా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం బీసీసీఐ విధిస్తున్న రెండేళ్ల బ్యాన్ సరిపోదు. అది పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ మరోసారి ఆలోచించాలి" అని గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement