జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

పసిడే లక్ష్యంగా ఇళ్లలో చోరీలు

పేట్రేగిపోతున్న చైన్‌స్నాచర్స్‌

హత్య చేసేందుకు సైతం వెనుకాడని నేరగాళ్లు

బంగారం విలువ పెరుగుతుండటంతో దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం ఇప్పుడు నేరగాళ్లకు ప్రధాన టార్గెట్‌గా మారింది. ఇంట్లో బంగారం ఉన్నా.. బయటకు నగలు ధరించి వెళ్లినా.. సామాన్యుల్లో ఆందోళన ఎక్కువైంది. సాధారణంగా ప్రతీ మహిళ మెడలో మంగళసూత్రంతో పాటు బంగారు గొలుసు ఉంటాయి. ఇలాంటి తరుణంలో మహిళలే టార్గెట్‌ చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

– సాక్షి, సిద్దిపేట

బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం కాలంగా ధరలు పెరుగుతున్నాయి. ఇదే నేరగాళ్లకు పెద్ద టార్గెట్‌గా మారింది. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశ, ఈజీ మనీ మోజుతో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం దొపిడీకి పాల్పడిన తర్వాత సదరు వ్యక్తులను హత్య చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

నిఘా అవసరం

చోరీ సొమ్మును వెంటనే నగదుగా మార్చుకునేందుకు కొందరు అక్రమ కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నారు. బిల్లులు లేకుండానే బంగారం కొనుగోలు చేసే షాప్‌లు నేరాలకు పాల్పడే వారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థపై కఠి న నిఘా అవసరమని ప్రజలు కోరుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉంది. మహిళలు, వృద్ధులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనుమానిత వ్యక్తులతో మాట్లాడకూడదు. మాటలతో నమ్మించే అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కి కాల్‌ చేసి సమాచారం అందించాలి.

–రష్మీ పెరుమాళ్‌, సీపీ

Advertisement
 
Advertisement
Advertisement