● సరఫరాలో పారదర్శకతకు చర్యలు
● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇసుక కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక సరాఫరాను పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ‘మన ఇసుక వాహనం’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రమంలో లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా పౌరులు స్వయంగా ఆన్‌లైన్ లాగిన్ ద్వారా ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. మొదటగా https://tgmiv.cgg. gov.in ను సంప్రదించాలని, బుక్ శాండ్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఫోన్‌నెంబర్, వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్‌లు పరిశీలించి ఇసుకను మంజూరు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు దరఖాస్తు చార్జీలు మాత్రమే చెల్లించాలని, ఎలాంటి ఇతర అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
ఇతర అవసరాలకు నిర్ధారిత ఫీజు
వ్యక్తిగత, ప్రభుత్వ పనులు, ఇతర అవసరాల కోసం ఇసుక బుక్ చేసుకునే వారు ప్రభుత్వం వెబ్‌సైట్‌లో నిర్ణయించిన ధరల ప్రకారం రేట్లు చెల్లించాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులు సరైన వివరాలు నమోదు చేయాలని, రవాణా కోసం వాహనాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా వెబ్‌సైట్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విధానంతో ఇసుక సరాఫరా ప్రక్రియ వేగంగా, అవినీతి రహితంగా కొనసాగుతుందని, ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.


