రూ.317కోట్ల నిమ్జ్, టీజీఐఐసీ భూసేకరణ నిధులు మళ్లింపు
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల తప్పిదాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాగ్ (కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో కడిగిపారేసింది. ప్రధానంగా నిధుల మళ్లింపు, అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణ లోపాలను గుర్తించింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్–2025 నివేదికలో ఈ లోపాలను స్పష్టంగా పేర్కోవడంతోపాటు సిద్దిపేటలోని రాజీవ్‌పార్కు, మైత్రివనం, కోమటిచెరువు, పార్కుల నిర్వహణ బాగుందని ప్రశంసించింది. కాగ్ నివేదికలో ఉమ్మడి మెదక్ జిల్లాకుసంబంధించిన అంశాలను పరిశీలిస్తే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జహీరాబాద్‌లోని నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) భూసేకరణ కోసం హడ్కో నుంచి తీసుకున్న రూ.725 కోట్ల రుణంలో రూ.317 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. ఈ భూసేకరణ విషయంలో అధికారుల తీరుపై అక్షింతలు వేసింది. మొత్తం 12,635 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరుగుతోందని తన నివేదికలో పేర్కొంది.
కల్యాణలక్ష్మి
రికార్డుల నిర్వహణలోపాలపై..
కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణలో సంగారెడ్డి రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టింది. లబ్ధిదారులకు సంబంధించిన హార్డు కాపీలను అందుబాటులో ఉంచలేదని తన నివేదికలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ రికార్డుల నిర్వహణ ఉందని మొట్టికాయలు వేసింది. నారాయణఖేడ్‌లోని మినీస్టేడియం నిర్మాణం తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రూ.2.65 కోట్లతో చేపట్టిన ఈ మినీస్టేడియం డిజైన్ ఖరారులో ఆలస్యం, పనుల్లో జాప్యం, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో రూ.కోట్లలో నిధులు వృథా అయ్యాయని తన నివేదికలో పేర్కొంది.
సిద్దిపేట పార్కుల నిర్వహణపై ప్రశంసలు
సిద్దిపేటలోని రాజీవ్‌పార్కు, మైత్రివనం, కోమటిచెరువు, పార్కుల నిర్వహణ బాగుందని కాగ్ తన నివేదికలో ప్రశంసలు కురిపించింది. ఇదే సిద్దిపేటలో మురుగునీటి శుద్ధీకరణ ప్రాజెక్టు భాగంగా రూ.158.34 కోట్లతో నిర్మించిన మూడు సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నీటిశుద్ధి చేయడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన రిపోర్టులకు కాగ్ వంతపాడింది. తాగునీటి పథకానికి సంబంధించి మిషన్ భగీరథ నిధులు వినియోగించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ పథకం నిధుల నుంచి రూ.1.50 కోట్లను మళ్లింపుపై కాగ్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జరిగిన లోపాలను తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల లోపాలను కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది.
సిద్దిపేటలో మిషన్‌భగీరథకు అమృత్ నిధులు
కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణపై అక్షింతలు
రేవంత్ సర్కారు లోపాలను ఎత్తిచూపిన కాగ్ నివేదిక–2025
రిపోర్ట్‌లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు అంశాలు


