నిత్యావసర సరుకుల ధరలు ౖపైపెకి ఏమీ కొనేటట్టులేదు.. తినేటట్టు లేదు కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారుల మాయాజాలం దృష్టిసారించని అధికారులు
ధరల సెగ.. సామాన్యుడు విలవిల
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల.. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా దిగుమతులు నెమ్మదించడం, షిప్పింగ్ ధరలు పెరగడంతో మార్కెట్‌లో ప్రతి వస్తువు ధర పెరిగింది. దీనికి తోడు కొందరు వ్యాపారులు యుద్ధాన్ని బూచిగా చూపుతూ ధరలు పెంచి వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 10.12లక్షల మంది జనాభా ఉండగా 4లక్షలకు పైగా కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబ సగటున రోజుకు 100 మిల్లీలీటర్ల వంట నూనె వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం అన్ని రకాలపైనా లీటరుకు రూ.25 నుంచి రూ.35 పెరిగింది. ఈ లెక్కన రోజుకు జిల్లా ప్రజలపై దాదాపు రూ.5లక్షలకు పైగా భారం పడుతోందని అంచనా.
వంట నూనెల వ్యాపారం చేసే వారు జీరో బిల్లులే ఇస్తున్నారు. ఒరిజినల్ బిల్లు అడిగితే మరుసటి రోజే వంట నూనెల సరఫరా ఆలస్యం చేస్తున్నారు. బ్రాండెడ్ నూనెల కోసం తప్పని పరిస్థిలలో జీరో బిల్లులోనే నూనెలను తీసుకోవాల్సి వస్తోందని పలువురు చిరు వ్యాపారులు అంటున్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలతో పాటు మండల కేంద్రాలలో ఎక్కువగా ఈ నూనెల అమ్మకాలు జరుగుతున్నాయి. జీరో బిల్లులపై జీఎస్‌టీ అధికారులు ఒక్కసారి సైతం తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. కొన్ని సంవత్సరాలుగా ఈ దందానే కొనసాగుతోంది.
పూటగడవడం కష్టంగా ఉంది
యుద్ధం ఏమో కానీ నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నూనె ధరలు అధికంగా పెరిగాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం దృష్టి సారించి ధరలను నియంత్రించాలి. –రేపాక పుష్పలత, గృహిణి
ఇలా అయితే బతికేదెట్లా..
ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ధరలు మండి పోతున్నాయి. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మండిపోతున్నాయి. ధరల పెరుగుదలతో ఏమీ కొనలేకపోతున్నాం. ప్రభుత్వాలు దృష్టి సారించి రేషన్ షాప్‌ల ద్వారా నిత్యావసర సరుకులను అందించాలి. –మహేశ్వరి, మిట్టపల్లి
కృత్రిమ కొరత సృష్టించి..
నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను వ్యాపారులు సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించిన, అధిక ధరలకు అమ్మినా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఉన్న నియంత్రణ కమిటీలు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ మొక్కుబడిగా మారాయి. అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. హోల్‌సేల్ వ్యాపారాలు, పెద్ద కిరాణం షాపులను తనిఖీ చేస్తే అధిక ధరలకు అమ్మకుండా నియంత్రణలో ఉంటారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.


