చేర్యాల(సిద్దిపేట): మండలంలోని ఆకునూరులో వైద్య విద్యార్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు ప్రజలకు వైద్యం చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు పలు ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన శ్రీధర్, యాదగిరి, రాజేష్, విజయ్‌కుమార్ క్లినిక్‌లలో తనిఖీలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. యాదగిరి అనే వ్యక్తి వద్ద నార్కోటిక్ డ్రగ్‌యాక్ట్ కిందకు వచ్చే పలు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ గుర్తించామన్నారు. రాజేష్ అనే వ్యక్తి క్వాలిఫైడ్ నర్సు. తాను ప్రాక్టీస్ చేయడం మానేసినట్లు తెలిపారని, అతడి నర్సింగ్ కోర్స్ సర్టిఫికెట్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్స్ పరిశీలించినట్లు తెలిపారు. విజయ్‌కుమార్ అనే వ్యక్తి క్లినిక్‌లో యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, వాడిన ఐవి సెట్స్, సర్జరీకి ఉపయోగించే పరికరాలు గుర్తించామన్నారు. శ్రీధర్ అనే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో అతడి క్లినిక్ పరిశీలించలేదన్నారు. ఇరువురి వద్ద లభించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఇన్‌చార్జి ఎంపీడీఓ ప్రకాశ్, ఎస్‌ఐ అపూర్వరెడ్డి, ఆర్‌ఐ రాజేందర్‌రెడ్డి, ముస్త్యాల పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


