నియోజకవర్గాల పునర్విభజన! | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గాల పునర్విభజన!

Mar 25 2026 9:22 AM | Updated on Mar 25 2026 9:22 AM

● జిల్లాలో ఐదుకు చేరనున్న అసెంబ్లీ స్థానాలు ● కొత్తగా ఏర్పడనున్న కొమురవెల్లి/చేర్యాల ● మారనున్న రాజకీయ ముఖచిత్రం

● జిల్లాలో ఐదుకు చేరనున్న అసెంబ్లీ స్థానాలు ● కొత్తగా ఏర్పడనున్న కొమురవెల్లి/చేర్యాల ● మారనున్న రాజకీయ ముఖచిత్రం

సాక్షి, సిద్దిపేట: జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఒక అసెంబ్లీ స్థానం పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం మేర పెంచేలా కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం అమలైతే జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాల సంఖ్య ఐదుకు పెరిగే అవకాశం ఉంది.

కొత్తగా కొమురవెల్లి/చేర్యాల

జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 10.12లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం 26 మండలాలు ఉండగా సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రాలున్నాయి. జనగామలోని నాలుగు మండలాలు, మానకొండూరులోని ఒక మండలం ఉంది. అలాగే గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాలోని పలు మండలాలు మెదక్‌ జిల్లాలో ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాలు జనరల్‌ స్థానాలే ఉన్నాయి. హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు అయ్యే అవకాశాలున్నాయి. దీంతో కొమురవెల్లి/ చేర్యాల కేంద్రంగా నూతనంగా నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే పాత నియోజకవర్గాల్లో ఒకటి మహిళకు రిజర్వ్‌ అవుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో మూడు లోకసభ నియోజకవర్గాల పరిధిలో పలు మండలాలున్నాయి. దీంతో జిల్లా మొత్తం కలిపి ఒకటే నియోజకవర్గం ఉండేలా చేస్తే సిద్దిపేట లోకసభ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలున్నాయి.

మారనున్న రాజకీయ సమీకరణలు

జిల్లాలోని రాజకీయ సమీకరణలు సమూలంగా మారుతాయి. నియోజవర్గాల సంఖ్య పెరిగితే జిల్లాలోని పాత సరిహద్దులు మారుతాయి. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాల స్వరూపం మారుతుంది. స్థానాల పెంపుతో రిజర్వేషన్ల ప్రక్రియలో భారీ మార్పులు వస్తాయి. నియోజకవర్గాల మార్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి పునర్విభజన ఎలా ఉంటుందో అని రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement