నేటి నుంచే యూరియా బుకింగ్
ప్రశాంత్‌నగర్(సిద్ధిపేట): రైతులకు యూరియాతో పాటు ఇతర ఎరువులు సకాలంలో, పారదర్శకంగా అందించేందుకు రూపొందించిన ‘యూరియా బుకింగ్– మొబైల్ యాప్’ను సోమవారం నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ రైతుల ఖాతా ఆధారంగానే యూరియా బుకింగ్ విధానం అమలు చేస్తామన్నారు. రైతులు కాకుండా ఇతరులు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై రైతులు యాప్‌లో పంట వివరాలు నమోదు చేసి అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. పాస్‌బుక్, మొబైల్ నంబర్ నమోదు చేసిన తరువాత ఓటీపీ ద్వారా ధ్రువీకరణ జరుగుతుందని చెప్పారు. భూమి విస్తీర్ణం మేరకు యూరియా విడతలుగా అందజేస్తామని తెలిపారు. రైతులు డీలర్ వద్దకు వెళ్లే ముందు తప్పనిసరిగా బుకింగ్ నంబర్ తీసుకొని వెళ్లాలన్నారు. బుకింగ్ చేసిన 24 గంటలలోపు యూరియా కొనుగోలు చేయాలని తెలిపారు. యూరియా పంపిణీ పూర్తిగా ఈ–పాస్ విధానంలోనే జరుగుతుందన్నారు. యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా యూరియా ఎక్కడ అందుబాటులో ఉందో రైతులకు నేరుగా సమాచారం లభిస్తుందన్నారు. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ముందుగానే యూరియా బుక్ చేసుకోవాలని ఆమె కోరారు.
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి


