‘నారోజు’కు జాతీయ ప్రతిభా లెజెండరీ అవార్డు
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న నారోజు వెంకటరమణ ప్రతిభా లెజెండరీ అవార్డు అందుకొన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, అభ్యుదయ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జాతీయ ప్రతిభా లెజెండరీ పురస్కారాల మహోత్సవం జరిగిందన్నారు. కళారంగంలో ఉత్తమ గాయనిగా రాణిస్తున్నందుకు గాను ఈ అవార్డు అందించారని చెప్పారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్ కళారత్న బిక్కికృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సభ్యుడు డాక్టర్ నాలేశ్వరం శంకరం, బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ బీఎస్ రాములు, విశ్రాంత హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చంద్రకుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు ఆమె తెలిపారు.


