
అమ్మో..
నకిలీ లెక్చరర్లు!
●జిల్లా వ్యాప్తంగా 20 మంది ●తప్పుడు పత్రాలతో కొలువులు
●ప్రైవేటు యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ల గుర్తింపు
●ఇటీవల 172 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు పలువురు నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారని ఇంటర్ విద్యా శాఖ గుర్తించింది. జిల్లాలో ఇరవై మంది లెక్చరర్లు ఇతర రాష్ట్రాల ప్రైవేటు యూనివర్సిటీ పేరుతో ఉన్న ఫేక్ సర్టిఫికెట్లను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 2, 2014 వరకు పనిచేస్తున్న 3,800మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను 2023 మేలో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయగా జిల్లా నుంచి 172 మంది ఉన్నారు.
సాక్షి, సిద్దిపేట: రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి అయిన లెక్చరర్లను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. దీంతో లెక్చరర్లకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లను ఇంటర్మీడియెట్ విద్యాశాఖ పరిశీలన చేసింది. పలువురు ఇతర రాష్ట్రాల్లో ఆయా యూనివర్సిటీలలో సంబంధిత కోర్సులు లేకపోయినా ఆ కోర్సు చదివినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఫేక్ సర్టిఫికెట్లతో లెక్చరర్‌గా ఉద్యోగం పొందిన వారిలో ఆందోళన మొదలైంది.
దాదాపు 20 మంది ఫేక్ సర్టిఫికెట్లు
జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పొందిన 172 మంది అధ్యాపకులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను వరంగల్ ఆర్‌జేడీ ఇటీవల పరిశీలించారు. ప్రభుత్వ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లతోపాటు బోనఫైడ్ పత్రాలనూ ఆయా యూనివర్సిటీలలో ఇంటర్ విద్యాశాఖ చెక్ చేయించింది. అందులో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీలలో దాదాపు 20 మంది చదివినట్లు సర్టిఫికెట్లను అందించారు. పాండిచ్చేరి, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీలలో దూరవిద్య కేంద్రాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించారు. ఆ వర్సిటీకీ యూజీసీ గుర్తింపు ఉందా? ఆ కోర్సు ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరికొందరు పదోతరగతి సర్టిఫికెట్లపై పుట్టిన తేదీలను మార్చారు. 14 ఏళ్ల పాటు వరుసగా సర్వీసులో ఉన్న వారిని క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకు విరుద్దంగా మధ్యలో సర్వీస్ బ్రేక్ అయిన వారిని సైతం హడావుడిగా క్రమబద్ధీకరించినట్లు తెలిసింది.
●
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అధ్యాపకులుగా క్రమబద్ధీకరణ పొందిన వారిలో గుబులు మొదలైంది. ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. వీరు ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు వివిధ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. డబ్బులు వెచ్చించి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పరిశీలన జరుగుతోంది
లెక్చరర్లను ప్రొబేషనరీ పీరియడ్ నుంచి పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆర్‌జేడీ పరిశీలించారు. మన రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలలో చదివిన వారివి చెక్ చేశారు. ఇతర రాష్ట్రాల ప్రైవేటు యూనివర్సిటీలలో పలువురు చదివినట్లు సర్టిఫికెట్లు అందించారు. వాటిని పరిశీలించకుండా పక్కన పెట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయలేదు. త్వరలో వాటిపై ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది.
– రవీందర్ రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ అధికారి, సిద్దిపేట

అమ్మో..