
అవినీటి అధికారులపై వేటు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీటి పారుదల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకు పోయి పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారులకు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఈ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు మూకుమ్మడి బదిలీలు జరగనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులకు ఏమాత్రం తీసిపోని స్థాయిల్లో జిల్లాలోని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడ్డారు. ఇలాంటి అధికారులపై దృష్టిసారించిన ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.
మూడేళ్లకోసారి బదిలీ ఎక్కడ?
నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నేతల పంచన చేరుతున్న కొందరు అధికారులు ఏకంగా తొమ్మిదేళ్లుగా ఒకేచోట కదలకుండా ఉన్నారంటే ఈ అధికారులు ఏ స్థాయిలో అక్రమార్జన కూడగట్టారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఈశాఖలో ఒక చీఫ్ ఇంజనీర్, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 24 డీఈ పోస్టులున్నాయి. అలాగే సుమారు 80కిపైగా ఏఈలు, ఏఈఈలు పనిచేస్తున్నారు. ఖాళీలు పోగా సుమారు 120మందికి పైడా ఇంజనీరింగ్, టెక్నికల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఇందులో కొందరు దశాబ్ద కాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులున్నారంటే ఏ స్థాయిలో వీరి ఆగడాలు సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సంగారెడ్డి కోసమే
ప్రత్యేక బదిలీలు
రాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఇంజనీరింగ్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదుగురు డీఈలకు, 11 మంది ఏఈఈలకు స్థాన చలనం కలిగింది. అయితే ఈ బదిలీలతో సంబంధం లేకుండా సంగారెడ్డి జిల్లా కోసం ప్రత్యేకంగా బదిలీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వందల కోట్లు అక్రమార్జనకు మరిగిన ఈశాఖ అధికారులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఈ బదిలీల విషయం ముందే పసిగట్టిన ఈ అక్రమార్కులు మళ్లీ మంచి పోస్టింగ్‌ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుండటం గమనార్హం.
ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం
చెరువుల ఆక్రమణదారులతో చెట్టపట్టాల్
వందల చెరువుల అన్యాక్రాంతానికి
పరోక్ష సహకారం
కోట్లలో అక్రమాస్తులు కూడగట్టిన
ఇంజనీరింగ్ అధికారులు
త్వరలో జారీ కానున్న
బదిలీల ఉత్తర్వులు!
సంగారెడ్డి ప్రాంతంలో సుమారు తొమ్మిదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఓ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి చెరువుల కబ్జాదారులతో చేతులు కలిపారు. కంచే చేను మేసిన చందంగా చెరువులను కాపాడాల్సిన ఈ అధికారి వీటిని కబ్జా చేస్తూ వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలంగా వ్యవహరించారు. చెరువుల్లోంచి మట్టిని అక్రమ రవాణాదారుల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారు. పైగా చెరువులను ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందితే చాలు.. పెద్ద మొత్తంలో దండుకోవడం, ఆక్రమణదారులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంలో సదరు అధికారి ఆరితేరారు. రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారిపై ఇప్పుడు బదిలీ వేటు వేయాలని ఆశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
పటాన్‌చెరు ప్రాంతంలో సుమారు నాలుగున్నరేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న మరో ఇంజనీరింగ్ అధికారి చెరువుల కబ్జా రాయుళ్లతో చెట్టపట్టాలేసుకున్నాడు. సుమారు నాలుగు వందలకు పైగా చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర వాటర్‌బాడీలకు ఎన్‌ఓసీలు జారీ చేసి రూ.వందల కోట్లు వెనకేసుకున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. పైగా చెరువులను కబ్జా చేసే అక్రమణదారులతో చేతులు కలిపి పదుల సంఖ్యలో చెరువులు అన్యాక్రాంతం అయ్యేందుకు పరోక్షంగా సహకరించాడు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఈ అధికారికి స్థానచలనం కల్పించాలని ఆశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.