
టూరిజం ప్రదేశంగా మల్లన్న వనం
కొండపాక(గజ్వేల్): భవిష్యత్తులో మల్లన్న వనం టూరిజం ప్రదేశంగా మారనుందని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ అన్నారు. మల్లన్న సాగర్‌కు ఆనుకొని కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామ శివారులో మల్లన్న వనంలో నిర్మిస్తున్న ముఖ్య అధికారుల, సిబ్బంది గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించేలా.. పనుల్లో పాదర్శకతలు లోపించకుండా పనులు చేపట్టాలన్నారు. మల్లన్న వనం విసీ్త్రర్ణం రూట్ మ్యాప్‌ను పరిశీలిస్తూ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ మల్లన్న వనం విస్తీర్ణం 4,794 హెక్టార్లకు గాను సుమారు 1,324 హెక్టార్ల భూమి మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి వెళ్లగా మిగతా 3400 హెక్టార్ల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. వనంలో అన్ని రకాల ఔషధ, పండ్ల, ఇతరత్రా మొక్కలు పెంచాలన్నారు. వనంలో వన్య ప్రాణుల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ శ్రీనివాస్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఇక్రమొద్దిన్, ఫారెస్టు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్