
సేంద్రియం సాగుతోనే ఆరోగ్యం
సిద్దిపేటరూరల్: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా నూతన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ సాగు చేపట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం మండల పరిధిలోని తోర్నాలలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధనలు రైతులకు ఉపయోగపడేలా కృషి చేస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వంగడాలను, కొత్త పద్ధతులను పాటిస్తూ రసాయనాలు వాడకుండా సాగు చేపట్టాలన్నారు. యూరియా అధికమోతాదులో వాడడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమై అనారోగ్యం బారిన పడుతున్నామన్నారు. మేలురకమైన పద్ధతులతో సేంద్రియ సాగుచేపట్టి మంచి ఆహారాన్ని పొందాలన్నారు. తాను వ్యవసాయం చేశానని, అన్ని పంటలు పండించే ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉందన్నారు. అంతకుముందు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆధునిక పద్ధతులే మేలు
రైతు వంగ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ, సాంకేతికత వినియోగం ద్వారానే రైతు ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, సేంద్రియ సాగుతో భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి సంతోష్ కుమార్, ఏడీఏ పద్మ, అసోసియేషన్ డీన్ ఏజీ కాలేజీ సిరిసిల్ల సునీత దేవి, శాస్త్రవేత్తలు పల్లవి, రమాదేవి, మోహన్, ఏఓ నరేశ్, ఏఈఓ గీతా, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు కబ్జా కావొద్దు
జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్గదర్శకాల మేరకు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. మిస్సింగ్ సర్వే నంబర్, పెండింగ్ మ్యుటేషన్, ఫీల్డ్ ఎంకై ్వరీ, పేరుమార్పు, రకం, విస్తీర్ణం మార్పు, నేషన్‌ఖాతా, పీఓబీ, సాదాబైనామా వంటి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సాగులో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి
కలెక్టర్ హైమావతి
తోర్నాల విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు