
దేవాదుల కాలువలు పూర్తి చేయండి
మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే పల్లా వినతి
కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో అసంపూర్తిగా ఉన్న దేవాదుల కాలువలను పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌ను కోరారు. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఎమ్మెల్యే మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయడానికి, సేకరించిన భూమికి నిధులు విడుదల చేసి కాలువ పనులు పునరుద్ధరించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. స్పందించిన మంత్రి.. తక్షణ చర్యలు తీసుకుని పనులు వెంటనే మొదలు పెట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పారామెడికల్ సిబ్బందితో డీఎంహెచ్‌ఓ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ రేవతి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నంగునూరు(సిద్దిపేట):విద్యార్థులకు మధ్యా హ్న భోజనం అందించడంలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎం పద్మ మంగళవారం సస్పెండ్ అయ్యారు. బద్దిపడగ ఉన్నత పాఠశాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం అందించకపోవడం, పాఠశాల పరిశుభ్రంగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని ఫోన్‌లో ఆదేశించడంతో ఈ మేరకు డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
చేర్యాల(సిద్దిపేట): గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీఓ పోలోజు నర్సింహాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చేర్యాల, వర్గల్, కోహెడ, చిన్నకోడూరు, అల్వాల్, దుబ్బాక, హుస్నాబాద్, బాలికల పాఠశాలలు, ములుగు, జగదేవపూర్, గజ్వేల్, సిద్దిపేట రూరల్, రామక్కపేట, మిట్టపల్లి, తొగుట, బెజ్జంకిలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీజీసెట్ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 16 లోపు చేర్యాల గురుకుల పాఠశాల, లేదా దగ్గరలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

దేవాదుల కాలువలు పూర్తి చేయండి