
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు అధికం
మిరుదొడ్డి(దుబ్బాక): దీర్ఘకాలికంగా సాగు చేసే ఆయిల్‌పామ్ పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని ఆయిల్‌ఫెడ్ ప్లాంట్ మానిటరింగ్ ఆఫీసర్ రాములు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో రైతు అంజిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ సాగును సోమవారం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయిల్‌పామ్ గెలలను ఎలా హార్వెస్టింగ్ చేయాలి? నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు రూ.19,400 ధర పలుకుతోందన్నారు. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్ తోటల్లో కోకో వంటి అంతర పంటలు సాగు చేస్తే అదనంగా రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఎకరానికి నికరంగా ప్రతి సంవత్సరం 10 టన్నుల ఆయిల్‌పామ్ దిగుబడిని పొందవచ్చని తెలిపారు. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో మర్కెటింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయిల్‌పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, రైతులు వెంకట్‌రెడ్డి, రామస్వామి, యాదగిరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.