
ఉద్యానం.. కొత్త ఉత్సాహం
గజ్వేల్: ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈనెల 9న విడుదల చేసిన ‘ఉద్యాన పంటల ప్రణాళిక–2035’పై ఆశలు చిగురించాయి. కొంత కాలంగా ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహంపై స్తబ్ధత నెలకొన్న తరుణంలో తాజాగా ప్రభుత్వ ప్రకటనతో కొత్త ఉత్సాహం నెలకొన్నది. ప్రభుత్వ సహకారం పెరిగితే ప్రత్యేకించి ఉద్యాన పంటలకు హబ్‌గా ఉన్న ఉమ్మడి జిల్లాలో సాగు మరింతగా విస్తరించనున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యాన పంటల (కూరగాయలు, పండ్లు, పూలు)కు హబ్‌గా మారింది. 40కిపైగా మండలాల్లో భారీగా ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. పదిహేనేళ్ల కిందట కేవలం 10వేల ఎకరాలకే పరిమితమైన ఉద్యాన పంటలు ప్రస్తుతం 2.5లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం నిత్యం నుంచి వేలాది టన్నులు కూరగాయలు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చైన్నె, బెంగళూరు, మహారాష్ట్రలోని, చంద్లాపూర్, కలకత్తా తదితర రాష్ట్రీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి.
ప్రభుత్వ సహకారం లేక ..
ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడంతో రైతులను నిరాశకు గురిచేస్తున్నది. విత్తన సబ్సిడీ కనుమరుగవటం, పందిరి, ఫాల్‌హౌస్ పథకాలకు చేయూత లేకపోవడంతోపాటు సలహాలు, సూచనలు అందించేందుకు క్షేత్రస్థాయిలో తగినంతగా ఉద్యానశాఖ సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
యూనివర్సిటీ కీలక సూచనలు..
● ఉద్యాన ప్రణాళికలో ప్రభుత్వానికి హార్టికల్చర్ యూనివర్సిటీ కీలకమైన సూచనలు చేసింది. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలేకాకుండా, రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు ఉపయెగపడే సూచనలు ఉన్నాయి.
● ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ములుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేసి మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో నిర్వహించేలా చూడాలని సూచనలు చేశారు.
● వంటిమామిడి లాంటి కూరగాయల మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు సక్రమంగా జరిగేలా చూడాలని నిర్దేశించారు.
● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యాన పథకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ నిధులు వినియోగించుకోవాలని నిర్ణయించారు. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదు. అందువల్ల పథకాల అమలు నిలిచిపోయింది. ఇక నుంచి మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసి రైతులకు పథకాలను చేరువ చేయాలని ప్రణాళికలో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
● ఎంఐడీహెచ్(మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్), ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హార్టికల్చర్ మిషన్), హెచ్‌సీడీపీ (హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)లను వాడుకోవాలని సూచించారు.
● ప్రతి ఎకరానికి పెట్టుబడి ఖర్చు తగ్గించి, ఉత్పాదకతను పెంచడంతోపాటు.. మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
● ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ యంత్రాల కోసం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, రైతులకు సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని యూనివర్సిటీ సూచించింది. ఇవే కాకుండా మరెన్నో అంశాలను ప్రభుత్వానికి ప్రణాళికలో సిఫార్సు చేసింది.
ఉద్యాన సాగును పెంచుదాం
ఉద్యాన పంటల సాగును పెంచడమే లక్ష్యంగా ఉద్యాన ప్రణాళిక– 2035ని రూపొందించాం. ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలుకు సుముఖంగా ఉంది. వచ్చే రోజుల్లో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు ప్రోత్సాహం పెరగనుంది.
– రాజిరెడ్డి, వైస్ ఛాన్సలర్,
హార్టికల్చర్ యూనివర్సిటీ
ప్రణాళిక–2035పై కోటి ఆశలు
ఉద్యాన పంటల హబ్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా
సహకారం లేక రైతుల్లో నిరాశ
ప్రభుత్వం చేయూతనిస్తే సాగు మరింత విస్తరణ

ఉద్యానం.. కొత్త ఉత్సాహం