
ఎవరి చేతికో పగ్గాలు!
● ఆశావహుల నుంచి అధిష్టానం దరఖాస్తుల స్వీకరణ
● ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు
● జిల్లా పరిశీలకురాలిగా ఏఐసీసీ నుంచి జ్యోతి రౌటేలా
● నేటి నుంచి బ్లాక్‌ల వారీగా సమావేశాలు
కాంగ్రెస్‌లో పదవుల పండుగ మొదలైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)అధ్యక్షులను నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుని ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో డీసీసీ పదవికి డిమాండ్ పెరిగింది. పదవిని ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
–సాక్షి, సిద్దిపేట
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతి రౌటేలా, పీసీసీ నుంచి జగదీశ్వర్ రావు, నజీర్ హుస్సేన్‌లను నియమించారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో పరిశీలకుల బృందం సమావేశాలు నిర్వహించనుంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, మండల అధ్యక్షులతో సమావేశమై అందరి అభిప్రాయాలను సేకరించనున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష పదవికి అర్హతలు ఉన్న నేతల పేరును పీసీసీ ద్వారా ఏఐసీసీకి పంపించనున్నారు.
నేటి నుంచి సమావేశాలు
డీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం పరిశీలకులు నియోజకర్గాలు, బ్లాక్‌ల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం దుబ్బాక బ్లాక్‌కు సంబంధించి దుబ్బాక పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్, మధ్యాహ్నం దౌల్తాబాద్ బ్లాక్ తొగుటలోని చెరుకు బాలమ్మ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 15న హుస్నాబాద్ పట్టణం, 16న సిద్దిపేట బ్లాక్ ఇర్కోడ్‌లోని లావణ్య గార్డెన్, మధ్యాహ్నం నంగునూరులో, 17న ఉదయం వర్గల్ మండలం శాకారం, మధ్యాహ్నం గజ్వేల్ పట్టణంలో సమావేశాలు, అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.
ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఇటీవల పీసీసీ క్రమశిక్షణ కమిటీకి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ సైతం తీసుకుంది. తనకే మరోమారు డీసీసీ పదవి ఇవ్వాలని నర్సారెడ్డి కోరుతున్నట్లు సమాచారం.
సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ కూడా డీసీసీ పదవి ఆశిస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లో వివిధ పదవులను హరికృష్ణ నిర్వర్తించారు.
పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాలో దరిపల్లి చంద్రం పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ, కార్మిక సంఘ నాయకుడిగా ఉన్న తనకు డీసీసీ అధ్యక్ష పదవినీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఎన్‌ఆర్‌ఐ గాడిపెల్లి రఘువర్ధన్ రెడ్డి సైతం డీసీసీ అద్యక్ష పదవి రేస్‌లో ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో వివిధ పదవులతో పాటు గాడిపెల్లి ట్రస్ట్ పేరుతో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి కోరారు.
జెడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్ గిరి కొండల్‌రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకైక కాంగ్రెస్ జెడ్పీటీసీగా మద్దూరు నుంచి గెలుపొందారు.
గజ్వేల్‌కు చెందిన పార్టీ నాయకుడు బండారు శ్రీకాంత్, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌లు సైతం ఆశలు పెట్టుకున్నారు.
అధిష్టానం మెప్పుపొంది అధ్యక్ష పీఠంపై ఆసీనులయ్యేందుకు ఎవరికి వారు మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడి పదవి ఎవరిని వరిస్తుందో అని జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది.

ఎవరి చేతికో పగ్గాలు!