
అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ హైమావతి
● ప్రజావాణిలో అర్జీల స్వీకరణ
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి జాప్యం లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 114 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్‌హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు రావొద్దు
కోహెడరూరల్(హుస్నాబాద్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. సోమవారం మండలంలోని శనిగరం గ్రామంలోని ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోనుగోలు కేంద్రానికి వచ్చిన ధ్యానాన్ని వెంట వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశించారు. తేమ శాతం రాగానే బస్తాలను అందించాలని అన్నారు.
పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి
కోహెడ(హుస్నాబాద్): పరిసరాల పరిశుభ్రతపై గ్రామాలలోని ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ హైమావతి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డెంగీ, మలేరియా కేసులపై ఆరా తీశారు. రోగులకు అన్నిరకాల మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రులకు అన్నిరకాల మందులు సరఫరా చేయాలని డీఎంఎచ్‌ఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.