
సీజేఐపై దాడి హేయమైన చర్య
● ఘటనపై వెల్లువెత్తిన నిరసన ● గజ్వేల్‌లో దళిత, ప్రజా,ఉపాధ్యాయ సంఘాల ర్యాలీ
గజ్వేల్: సీజేఐ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి ఘటనపై నిరసన వెల్లువెత్తింది. శనివారం దళిత, ప్రజా, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్‌లోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాపార్కు చౌరస్తా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాంచంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, దళిత, ప్రజా సంఘాల నాయకులు పి.ఎల్లయ్య, రాజులు, అటకూరి రాములు, కిష్టయ్య, కృష్ణ, యాదగిరి, పొన్నాల కుమార్, తుమ్మ శ్రీనివాస్ దాసరి ఏగొండ స్వామి, సందెబోయిన ఎల్లయ్య, నీరుడి స్వామి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజేఐపై దాడి..దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నా.. ఆధిపత్య కులాల నుంచి అవమానాలు తప్పడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాడిని వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.