
గెలుపు గుర్రాల వేట
● ‘స్థానిక’ పోరుపై పార్టీలు ప్రధాన దృష్టి ● ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం కసరత్తు ● పార్టీ నేతల అభిప్రాయ సేకరణలో బీఆర్‌ఎస్ ● దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్ ● ఇన్‌చార్జులను నియమించిన బీజేపీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరిగే వాటికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 9న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాయి. అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బరిలో నిలబడే వారిలో ఎవరికి మద్దతు తెలిపే విషయంపైనా కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లాలో జెడ్పీటీసీలు 26, ఎంపీటీసీలు 230, సర్పంచ్‌లు 508, వార్డులు 4,508 ఉన్నాయి.
– సాక్షి, సిద్దిపేట
బీఆర్‌ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక కోసం ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మెజార్టీ గ్రామ నాయకులు, కమిటీ అభిప్రాయాల మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అందరూ కలిసి కట్టుగా ఉండి బీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో బీఆర్‌ఎస్ ఇప్పటికే ఇంటింటికి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 22 నెలలు అయినా అమలు కావడం లేదని ప్రజలల్లోకి తీసుకవెళ్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న నాయకులు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ఆయా మండలాల కమిటీలను సూచించారు. ఈ నెల 3 తేదీ వరకు ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పీసీసీ నుంచి వచ్చే ఇన్‌చార్జి సమక్షంలో ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన నాయకుల పేర్లలను ఈ నెల 5న పంపించాలని సీఎం ఆదేశించారు. పీసీసీ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నిర్వహించనున్నారు.
వామపక్షాల పొత్తు ఉండేనా?
వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందా? లేదా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. జిల్లాలో భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ సైతం అభ్యర్థులను బరిలో దించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. పలువురు ఇండిపెండెంట్‌లుగా బరిలో దిగేందుకు సైతం పలువురు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇన్‌చార్జిల నియామకం
బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు ఇన్‌చార్జిలను నియమించింది. మండల అధ్యక్షులు, ఇన్‌చార్జులు, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్‌ను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు నిర్వహించారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.