
పంటల నమోదు తప్పనిసరి
నంగునూరు(సిద్దిపేట): రైతులు సాగు చేసిన పంట వివరాలను ఏఈఓల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. నంగునూరులోని రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని మంగళవారం ఏఓ గీతతో కలసి గోదాం, రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించారు. ఎరువులు అమ్మిన వెంటనే రిజిష్టర్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం ఘణపూర్‌లో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ పంట అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పంట నమోదు తప్పనిసరన్నారు.
స్థానిక ఎన్నికల్లో
సత్తా చాటుదాం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
జగదేవ్‌పూర్(గజ్వేల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. కుకునూర్‌పల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుర్రం ఎల్లం తన కార్యకర్తలతో కలిసి మంగళవారం నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
బురుజుకు పునరుజ్జీవం
నంగునూరు(సిద్దిపేట): చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్న తరుణంలో వాటిని కాపాడేందుకు యువకులు ముందుకొచ్చారు. నంగునూరు మండలం మగ్ధుంపూర్‌లో మంగళవారం యువకులు శ్రమదానం చేసి బురుజుపై పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి దసరా ఉత్సవాలను సిద్ధం చేశారు.
నార్కోటిక్ డాగ్స్‌తో
తనిఖీలు
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని సీఐ వాసుదేవరావు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో నార్కోటిక్ డాగ్స్‌తో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు కలిగిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా, విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికై నా సమాచారం ఉంటే 100కు ఫోన్‌చేసి తెలియజేయాలని కోరారు.

పంటల నమోదు తప్పనిసరి

పంటల నమోదు తప్పనిసరి